సిద్దిపేట అర్బన్/ నంగునూరు, జూన్ 9: “ఆయిల్‌పామ్ సాగులో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలిచిందని.. ఆయిల్‌పామ్‌కు సిద్దిపేట హబ్‌గా మారుతుంది” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లిలో ఆయిల్‌పామ్ మొదటి పంట గెలలు కోసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ లాభదాయక పంట అని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించిందన్నారు. ఇందుకు ఫలితంగా ఆయిల్‌పామ్‌ను సిద్దిపేట జిల్లాలో అధికంగా సాగు చేశారన్నారు. నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని రూ.300 కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలోనే గంటకు 120 టన్నుల క్రషింగ్ చేసే కెపాసిటీ ఉన్న ఫ్యాక్టరీ నర్మెటలో నిర్మాణం జరుగుతోందన్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి నర్మెట ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభమవుతుందన్నారు. నర్మెట ఫ్యాక్టరీలో క్రషింగ్ మాత్రమే కాకుండా రిఫైనరీ యూనిట్ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాతో పాటు జనగామ, మహబూబాబాద్, గద్వాల్, నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి పామాయిల్ ఈ ఫ్యాక్టరీకే వస్తుందన్నారు.
జిల్లాలో మూడు నర్సరీలు ఏర్పాటు చేశామని.. రైతులకు అవసరమయ్యే మొక్కలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాల్లో సాగు చేస్తారని.. సిద్దిపేట జిల్లాలో 11 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారని.. రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తర్వాత ఆయిల్‌పామ్ సాగులో ద్వితీయ స్థానంలో సిద్దిపేట ఉందన్నారు. సిద్దిపేట జిల్లాలో డిసెంబర్ నెలాఖరులోగా వెయ్యి ఎకరాల్లో మొదట పంట కోతకు వస్తుందన్నారు. ఆయిల్‌పామ్ సాగులో నంగునూరు మం డలం ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో 40 శాతం మాత్రమే ఆయిల్‌పామ్ ఉత్పత్తి అయితే.. 60 శాతం దిగుమతి చేసుకుంటున్నామన్నారు. తెలంగాణలో రూ. 20 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు నాడు గులాబీ అధినేత కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేసిందన్నారు. నర్మెటలో నిర్మించ తలపెట్టిన ఫ్యాక్టరీలో రెండు వేబ్రిడ్జీలు పూర్తయ్యాయని.. పది కోట్ల లీటర్ల ఫాంపాండ్, ఇతర నిర్మాణాలు పూర్తయ్యాయని.. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 25 వరకు పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. పామాయిల్‌తో పాటు అంతర పంటలైనా కోకో, వక్క పంటలు సాగు చేస్తే అధికలాభాలు ఉంటాయన్నారు. ఎకరాకు లక్షా 20 వేల వరకు లాభం వస్తుందన్నారు.
ఆయిల్‌పామ్ సాగు మొదటి గెలలు కోయడం సంతోషంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. ఆదర్శ రైతు నాగేందర్ కోరిక మేరకు ఆయిల్‌పామ్ తోటకు వచ్చి తొలి పంట కోయడం సంతోషకరమని.. నాడు మొదటి మొక్క తనతో నాటించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్ రైతులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. నంగునూరు మండలం రాబోయే రోజుల్లో కోనసీమను తలపిస్తుందన్నారు. మొదటి మొక్కను నాటించి.. మొదటి గెలను కోయించడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు రైతు నాగేందర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం వానకాలం ప్రారంభం కాగానే.. రైతుబంధు విడుదల చేసే దని.. కానీ ఈ ప్రభుత్వం ఇంకా రైతు భరోసా నిధులు విడుదల చేయడం లేదని హరీశ్‌రావు అన్నారు. ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారని.. కానీ దానిపై ఏమీ మాట్లాడటం లేదని.. వెంటనే రైతుబంధు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాలు పడుతుండటంతో రైతులకు విత్తనాలు, ఎరువు బస్తాల కోసం పెట్టుబడి సహాయం అందించాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతుభరోసా విడుదల చేయాలన్నారు. రైతులందరికీ తక్షణం ఎకరానికి రూ.7500 ఇచ్చి ఆదుకోవాలన్నారు. జనుము, జీలుగ, పచ్చిరొట్ట విత్తనాలు దొరకడం లేదని రైతులు చెబుతున్నారని.. వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదన్నారు. వెంటనే రాష్ట్రమంతా పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిందని నేడు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెబుతున్నదని.. రాష్ట్రంలో 90 శాతం దొడ్డు వడ్లు మాత్రమే పండుతాయని హరీశ్‌రావు అన్నారు. రైతులను అన్యాయం చేయకుండా అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణశర్మ, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు కోల రమేశ్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు లింగంగౌడ్, ఎడ్ల సోమిరెడ్డి, వెంకట్‌రెడ్డి, కృష్టారెడ్డి, సారయ్య, మల్లయ్య పాల్గొన్నారు.
గతంలో దేశంలో ఆయిల్‌పామ్ దిగుమతికి 15 శాతం నుంచి 43 శాతం కస్టమ్ డ్యూటీ ఉండేదని.. దాన్ని అలాగే ఉంచితే రైతులకు లాభం చేకూరుతుందన్నారు. ఆయిల్‌పామ్‌కు కస్టమ్ డ్యూటీని వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్‌పామ్ టన్నుకు నేడు రూ.13,438 ఉందని.. కస్టమ్ డ్యూటీ ఉంటే ఆయిల్‌పామ్ ధర పెరిగి.. రైతులకు ధర పెరుగుతుందన్నారు. రైతును కాపాడుకోవాలంటే పామాయిల్ దిగుమతి పై కస్టమ్ డ్యూటీ వేయాలన్నారు. దీనిపై కేంద్రం స్పందించాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పామాయిల్ రైతులను చిన్నచూపు చూస్తుందని.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం క్రాప్ మెయింటెనెన్స్ కింద సంవత్సరానికి రూ.4200 ఇచ్చిందని, ఈ ప్రభుత్వం పూర్తిగా దాన్ని వేయడం లేదన్నారు. డ్రిప్ కంపెనీలకు సైతం డబ్బులు ఇవ్వడం లేదని.. ప్రభుత్వం స్పందించి ఆ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విధంగా మొక్కల కోసం ఇచ్చే సబ్సిడీ విడుదల చేయాలన్నారు.