వెల్దుర్తి, ఆగస్టు 1: అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేసేందుకు అధికారులు కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిపి శుక్రవారం వెల్దుర్తి, మాసాయిపేటలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను వారు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రేషన్‌కార్డు ప్రతి కుటుంబానికి ఎంతో ముఖ్యమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడానికి, విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం, సీఎంఆర్ఎఫ్ వంటి ఎన్నో పథకాలకు రేషన్ కార్డులు ప్రామాణికం అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో 6.80 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. నూతనంగా రేషన్ కార్డులు పొందిన వారికి ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాలని కోరారు. వెల్దుర్తి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులతో పాటు వెల్దుర్తికి వచ్చే విద్యార్థులు, అధికారులు, సిబ్బందికి బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయమై ఆర్టీసీ అధికారులతో కలెక్టర్ మాట్లాడి నడిచేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. రూ. 2లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు పంట రుణమాఫీ కాలేదని, రూ 2 లక్షలకు పైన ఉన్న డబ్బులను చాలామంది రైతులు అప్పులు చేసి చెల్లించారని, వారికి రూ. 2 లక్షల రుణా న్ని మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
గ్యాస్ రాయితీ, గృహజ్యోతి పథకాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు అవసరమైన యూ రియాను అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ..మెదక్ జిల్లాలో అర్హులైన 9964 కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామని, 34 వేల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చినట్లు తెలిపారు. రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులు దరఖాస్తు చేసుకుంటే విచారణ చేసి కార్డులు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమాల్లో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్లు బాలలక్ష్మి, జ్ఞానజ్యోతి, డిప్యూటీ తహసీల్దార్లు శ్రీనివాస్, వసంత, ఆర్ఐలు నర్సింగ్‌యాదవ్, ధన్సింగ్, అధికారులు, సిబ్బంది, లబ్దిదారులు, నాయకులు పాల్గొన్నారు.