సంగారెడ్డి, మే 22: ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందని, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ క్రాంతిని కలిసి అన్నదాతల ఇబ్బందులను వివరించారు. అనంతరం కలెక్టరేట్ బయట విలేకరులతో మాట్లాడుతూ పదేండ్లలో ఎన్నడూ కూడా విత్తనాలు, ఎరువుల కొరత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ పాతరోజులు వచ్చాయన్నారు. జోగిపేటలో మంగళవారం వానకాలం సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలకు విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో చెప్పులు, పట్టాపాసు పుస్తకాల జిరాక్సులు వరుసలో పెట్టారన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం అధికారులకు చెపుతున్నా వారిలో స్పందన లేకపోవడం విడ్డూరమన్నారు. సాగుకు ముందే రైతులకు ఎరవుల స్టాక్ వివరాలు తెలిసేలా అధికారులు ప్రచారం చేయాలని, మళ్లీ పాతరోజులు రాకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.