గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ 2017లో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది మొదటి విడతలో గొర్రెలు అందుకున్న ఎంతో మంది పశుసంవదను పెంచుకుని, విక్రయించి ఆర్థికంగా అభివృద్ధి చెందారు. ఇదే స్ఫూర్తితో రెండో విడతకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 10,331 యూనిట్లు, మెదక్‌లో 6195 మందికి యూనిట్లు అందజేయాలని లక్ష్యంగా పెటుకోగా, యూనిట్ విలువను ప్రభుత్వం రూ.1.25లక్షల నుంచి రూ.1.75లక్షలకు పెంచింది. ఇందులో లబ్ధిదారుడు 25శాతం చెల్లిస్తే, మిగతా 75శాతం సబ్సిబీ లభించనున్నది. ఇప్పటికే పలువురు తమ వాటాగా డీడీలు చెల్లించగా, మిగతా వారు సైతం డబ్బులు కట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. నెలాఖరులో ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు వరకు పంపిణీ పూర్తి చేయాలని సర్కారు భావిస్తున్నది. సోమవారం మెదక్ కలెక్టర్ రాజర్షి షా పంపిణీకి సంబంధించి విధి విధానాలపై, పశుసంవర్ధక శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
– సంగారెడ్డి/మెదక్ (నమస్తే తెలంగాణ) ఏప్రిల్ 17
గొర్రెల పంపిణీకి అధికారుల కసరత్తు ఈ నెల చివరి వారంలో పథకం ప్రారంభించే అవకాశం
సంగారెడ్డి/ మెదక్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : గొల్లకుర్మలను ఆర్థికంగా బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. 75 శాతం రాయితీపై రెండు విడతలుగా లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మొదటి విడత పంపిణీ పూర్తయింది. ఇప్పుడు రెండో విడత జీవాల పంపిణీకి రాష్ర్ట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ చివరి వారం నుంచి గొర్రెల యూనిట్లు పంపిణీ చేయనున్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పశు సంవర్ధకశాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది.
రాయితీని పెంచిన ప్రభుత్వం..
గొర్రెల యూనిట్ల పంపిణీకి ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం యూనిట్ విలువతో పాటు రాయితీని పెంచింది. మొదటి విడతలో యూనిట్ విలువ రూ.1,25 లక్షలు కాగా, లబ్ధిదారుడి వాటా రూ.31,250 చెల్లించారు. రెండో విడతలో యూనిట్ విలువ రూ.1,75 లక్షలు కాగా, లబ్ధిదారుడి వాటా 25 శాతం రూ.43,750 డీడీ తీసి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రూ.1,31,250 సొమ్మును ప్రభుత్వమే భరిస్తుంది. ఏదైనా కారణంతో గొర్రెలు చనిపోతే పరిహారం ఇవ్వడానికి ప్రతి గొర్రెకు కొనుగోలు సమయంలోనే ప్రభుత్వమే బీమా చేయిస్తున్నది. ప్రీమియం డబ్బులు సైతం యూనిట్లోనే జత చేయడంతో ప్రత్యేకంగా బీమాకు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందజేయనున్నారు. కాగా, రెండో విడత గొర్రెల పంపిణీ కోసం జిల్లా స్థాయిలో కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేస్తున్నారు. గొర్రెల యూనిట్ల రవాణా కోసం టెండర్లు నిర్వహిస్తున్నారు.
గొర్రెల పంపిణీకి సన్నద్ధమవుతున్న అధికారులు
సంగారెడ్డి జిల్లాలో 10,331, మెదక్ జిల్లాలో 6,152 మంది లబ్ధిదారులు
యూనిట్ ధర రూ.1.75 లక్షలు
ఒక యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు
ఆనందం వ్యక్తం చేస్తున్న గొల్లకుర్మలు
గొర్రెల పంపిణీపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
మెదక్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : రెండో విడత గొర్రెల పంపిణీ కోసం లబ్ధిదారుల్లో మంగళవారం నుంచి మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా మండల ప్రత్యేక అధికారులు, పశు సంవర్ధకశాఖ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి నిర్వహించిన సన్నాహక సమావేశంలో రెండో విడత గొర్రెల పంపిణీ అమలుకు విధి విధానాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొర్రెల అభివృద్ధి పథకం కింద మెదక్ జిల్లాలో 19,192 మంది లబ్ధిదారులను ఈ-లాబ్ పోర్టల్‌లో నమోదు చేసి, మొదటి విడతగా 12,997 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామన్నారు. త్వరలో నిర్వహించనున్న రెండో విడతలో 6,195 మంది లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ లక్ష్యమన్నారు. ఇందుకు సంబంధించి మండల ప్రత్యేకాధికారులు చెక్‌లిస్ట్ ప్రకారం మండలస్థాయిలో ప్రజాప్రతినిధులు, గొర్రె కాపరులతో సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు సంబంధించిన సర్టిఫికెట్లను దరఖాస్తుతో పాటు సేకరించాలన్నారు.
లబ్ధిదారుడు తన వాటా సొమ్ము 43,750 లను వర్చువల్ ఐడీ ద్వారా నేరుగా జిల్లా కలెక్టర్ ఖాతాకు బదిలీ చేయాలని సూచించారు. నియోజకవర్గం, మండలం వారీగా లబ్ధిదారుల వివరాలు ప్రతి ఒకరి వద్ద ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, కడప, కర్ణాటక రాష్ట్రంలోని దావనగిరి, చిత్రదుర్గ జిల్లాల నుంచి గొర్రెల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించిందని, లబ్ధిదారులను తీసుకెళ్లి కొనుగోలు చేయాలన్నారు. ఈ గొర్రెలకు సంవత్సరం పాటు బీమా ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా లబ్ధిదారుడికి గొర్రెల పంపిణీ చేపట్టాలని, ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను తీసి ఈ-లాబ్‌లో అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. గొర్రెల పంపిణీకి సంబంధించి 10 రకాల రిజిస్టర్లను పకాగా నిర్వహించవలసి ఉంటుందని సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు విజయ శేఖర్‌రెడ్డి, వెంకట శైలేశ్, శ్రీనివాస్, జయరాజ్, సాయిబాబా, సాయిరామ్, కృష్ణ మూర్తి, విజయలక్ష్మి, నాగరాజ్, రజిని, జెంలా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో మొదటి విడత పంపిణీ ఇలా..
సంగారెడ్డి జిల్లాలో 522 గొల్లకుర్మ సంఘాలు ఉండగా, 30,896 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడతలో గొర్రెల పంపిణీలో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 18,754 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. ఇందులో సంగారెడ్డి నియోజకవర్గంలో 2828 మందికి, పటాన్చెరులో 2101, అందోల్‌లో 4884, జహీరాబాద్‌లో 3691, నారాయణఖేడ్‌లో 4162 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయగా, హత్నూర మండలంలో 1088 మంది లబ్ధిదారులకు యూనిట్లను అందజేశారు.
రెండో విడతలో 10,331 యూనిట్ల..
సంగారెడ్డి జిల్లాలో రెండో విడతకు 12,142 లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేయాల్సి ఉంది. గొర్రెల యూనిట్లను పొందాలంటే గొర్రెకాపర్ల సంఘాలు తప్పనిసరిగా తమ పేరును ఈ-లాబ్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-లాబ్‌లో సంగారెడ్డి జిల్లాకు చెందిన 10,331 మంది మాత్రమే పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో 10,331 మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందులో ఇప్పటి వరకు 768 మంది లబ్ధిదారులు డీడీలు కట్టగా, 9563 మంది చెల్లించాల్సి ఉంది. వీరంతా తమ వాటా చెల్లించేలా పశుసంవర్థకశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే..
రెండో విడత గొర్రెల పంపిణీలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. మెదక్ జిల్లాలో మొదటి విడతలో 12,977 మంది లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశాం. రెండో విడతలో 6195 మందికి యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తాం.
– విజయ శేఖర్‌రెడ్డి, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి, మెదక్
మెదక్ జిల్లాలో మొదటి, రెండో విడత..
గొర్రెల యూనిట్లను పంపిణీ చేసేందుకు 2017 మే, జూన్‌లో ఒకేసారి మొదటి, రెండో విడత లబ్ధిదారులున ఎంపిక చేశారు. మెదక్ జిల్లాలో మొత్తం 341 గొర్రెల కాపరుల సహకార సంఘాలున్నాయి. ఇందులో 20,182 మంది సభ్యులు ఉన్నారు. గొర్రెల అభివృద్ధి పథకం కింద జిల్లాలో 19,192 మంది లబ్ధిదారులను ఈ-లాబ్ పోర్టల్‌లో నమోదు చేశారు. మొదటి విడతలో 12,977 మంది లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. రెండో విడతలో 6195 మంది లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటికే 850 మంది డీడీలు చెల్లించగా, త్వరలో వీరికి కూడా గొర్రెలను పంపిణీ చేయనున్నారు. రెండో విడతలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఏప్రిల్ చివరి వారం నుంచి ఆగస్టు నెలాఖరు వరకు యూనిట్లు పంపిణీ చేయనున్నది. కులవృత్తులకు జీవంపోస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
మొదటి విడతలో గొర్రెల యూనిట్లను అందుకున్న లబ్ధిదారులు ఆర్థికంగా ఎదిగి ఫలితాలను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 522 గొల్లకుర్మల సంఘాలు ఉండగా, 30,896 మంది సభ్యులు ఉన్నారు. మెదక్ జిల్లాలో 341 సంఘాలు, 20,182 మంది సభ్యులు ఉన్నాయి. ఈ మేరకు రెండో విడతకు సంగారెడ్డి జిల్లాలో 10,331, మెదక్ జిల్లాలో 6,152 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. పెరుగుతున్న ధరల దృష్యా ప్రభుత్వం ఈసారి ఒక యూనిట్ ధర రూ.1.75 లక్షలకు పెంచగా, అందులో లబ్ధిదారుడి వాటా కింద రూ.43,750, ప్రభుత్వం రూ.1,31,250ని రాయితీ కింద భరించనున్నది. ఒక్కో యూనిట్‌కి ఒక పొట్టేలు, 20 గొర్రెలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేయనుండడంతో గొల్లకుర్మలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.