రామాయంపేట రూరల్, జూన్ 29: ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు దగ్గరపడుతున్నా బడీడు పిల్లలు చాలా మంది బడి భయటే ఉంటున్నారు. ఉపాద్యాయులు గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేసినా బడిభయట పిల్లలు తిరగడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పకడ్బందీగా, శ్రద్దతో ప్రచారాలు చేస్తే ఇలా విద్యార్థులు బడి బయట ఎందుకు ఉంటారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే ఆసరాగా చేసుకొని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ ప్రచారం విసృతం చేశాయి. బడి ఈడు పిల్లలు అంటే పాఠశాలలకు వెళ్లే పిల్లలు బడిలోనే ఉండాలి. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలని, చదువుకోవాలని నిర్బంధ విద్యాహక్కు చట్టం చెబుతోంది. పాఠశాల అనేది పిల్లల సామాజిక అభివృద్ధికి ఒక ముఖ్యమైన ప్రదేశం. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచిత విద్యను అందిస్తోంది. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలతో పాటు పుస్తకాలు, యూనిఫాంలు ఇతర అవసరమైన వస్తువులను ఉచితంగా ఇస్తుంది.
ఇలా అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నా బడిభయటే బాల్యం మగ్గుతున్నది. పలక,బలపం పట్టాల్సిన చిట్టి చేతులు పలుగు, పార పడుతున్నాయి. చాలా వరకు గ్రామాల్లో బడీడు పిల్లలు బడులకు రాకుండా ఇంటి వద్దే ఉంటున్నారు. నిరుపేదలు వలసలు రావడం వారి పిల్లలను కూడా తమతో పనులకు తీసుకెళ్లడం జరుగుతుంది. రెండు మూడు గ్రామాల్లో ఉదయం పూట బడీడు పిల్లలు గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ బిక్షాటన చేస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఇటుకల బట్టీలు, కంపెనీలలో పనులు చేయడానికి వచ్చిన వారి పిల్లలు కూడా సంవత్సరాల తరబడి బడులకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయంలో విద్యా, కార్మిక శాఖ అధికారులు వారికి అవగాహన కల్పించి పిల్లలను బడుల్లో చేర్పించడానికి ముందుకు వస్తే చాలా మంది పిల్లలు బడుల్లో చేరే అవకాశం ఉందని ప్రజల అభిప్రాయం.
సాధ్యమైనంత వరకు బడి బయటి పిల్లలను బడిలో చేర్పించాం, ఎక్కడ కూడా బాల కార్మికులు లేరని రామాయంపేట ఎంఈవో శ్రీనివాస్ అన్నారు. సర్కారు బడుల్లో చేరాలని గ్రామాల్లో విసృతంగా ప్రచారం చేశాం. విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. ఎవరైనా బడి బయట పిల్లలు ఉంటే వారిని బడిలో చేర్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.