హుస్నాబాద్, మే 20: ధాన్యం కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేయడం వల్ల రైతులకు శాపంగా మారింది. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రానికి తెచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడం వల్ల సమయం వృథాకావడంతో పాటు అకాల వర్షాలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పూర్తిగా ఎండిన వడ్లను కూడా సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో వర్షం పడి తడిసిపోయి మళ్లీ ఎండేందుకు నాలుగైదు రోజులు ఉండాల్సి వస్తోంది. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్‌తోపాటు హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో పీఏసీఎస్ తరఫున 27కోనుగోలు కేంద్రాలు, ఐకేపీ తరఫున 13కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాదికంటే తక్కువ దిగుబడులు వచ్చి కొనుగోలు కేంద్రాలకు తక్కువ ధాన్యం వచ్చినా సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.గతేడాది ఈ సమయానికి దాదాపు అన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయి మూసివేశారు. కానీ పలు కేంద్రాల్లో ఇప్పటికీ ఇంకా వడ్లు ఉన్నాయి. ఎండిన వడ్లను వెంటనే కొనుగోలు చేస్తే వర్షం వల్ల ఇబ్బందులు ఉండేవి కావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో కొనుగోళ్లు జరుగక, అకాల వర్షాలు పడి వడ్లను కుప్ప చేస్తూ, ఆరబోస్తూ రైతులు అతలాకుతలం అవుతున్నారు. ఇప్పటికైనా తడిసిన ధాన్యా న్ని సైతం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
రెండెకరాల వరి పంట సాగు చేసిన. ధాన్యం మార్కెట్‌కు తెచ్చి ఎండబెట్టిన. ఒకరోజు ముందు నా వడ్లు కొంటే అకాల వర్షానికి తడిసేవి కావు. కొనకపోవడం వల్ల ఐదు రోజులుగా నాతోపాటు నా కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉండాల్సి వస్తోంది. మా దురదృష్టమేమో గానీ రోజూ వాన పడటం వల్ల వడ్లు తడిసిపోయి కొన్ని మొలకలెత్తినయ్. మూడు రోజుల నుంచి వడ్లను కుప్ప చేయడం, మళ్లీ ఆరబెట్టడం, ఆరబోసిన కొద్దిసేపటికే వానపడుతుంది. ఇప్పటికీ తడిసిన వడ్లు ఎండుత లేవు. నా వడ్లు ఎన్నడు ఎండాలే నేను ఎన్నడు ఇంటికి పోవాలె. ఇక్కడికి వచ్చిన నాయకులు తడిసిన వడ్లను కూడా కొంటారని చెప్తున్నరు. కానీ అధికారులు మాత్రం మొత్తం ఎండినంకనే కొంటామంటున్నరు. ఈ లోపు వానకు మొత్తం మొలలెత్తేటట్లు ఉన్నయ్. ఏం జేయాల్నో అర్థం అయిత లేదు. సర్కారోళ్లు ఆదుకోవాలని కోరుకుంటున్న.
కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి 20 రోజులు అవుతుంది. ఇంతవరకు అధికారులు కొనడం లేదు. రోజూ పడుతున్న వానలకు వడ్లు మొత్తం నాని మొలకలు ఎత్తాయి. మళ్లీ వాటిని ఎండబెట్టడానికి కష్టమవుతుంది. కనీసం అధికారులెవరూ ఇన్ని రోజులు అవుతున్నా రావడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోతుంటే బాధ వేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా రైతులకు మంచిగుండే… కాంగ్రెస్ పాలనలో అన్ని కష్టాలే…