సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 11: జిల్లాకేంద్రం సంగారెడ్డిలో పారిశుధ్య నిర్వహణపై కలెక్టర్ వల్లూరు క్రాంతి మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, పశు సంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలోని బైపాస్ రోడ్డు, ప్రధాన కూడళ్లు, చర్చి సమీపంలో, వార్డుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని, మున్సిపల్ కమిషనర్ ఉదయం వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు. తాగునీరు, పారిశుధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎవరైనా రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలని, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువైందని, రెండోసారి బాలుడిని కుక్క దాడిచేయడంపై కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. వీధి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చవాన్, పారిశుధ్య ఇన్సెక్టర్లు, ఎన్జీవోలు తదితరులు పాల్గొన్నారు.