NIMZ | జహీరాబాద్, ఏప్రిల్ 11 : నిమ్జ్ ప్రాజెక్టుకు భూములు అసలే ఇవ్వమని న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన నిమ్జ్ భూ బాధితులు జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం స్థానిక మండలంలోని హద్నూర్, గుంజోట్టి, హుస్సేల్లి, మామిడ్గి తదితర గ్రామాలకు చెందిన నిమ్జ్ భూ బాధితులు జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయానికి వచ్చి ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన నిమ్జ్ భూబాధితులు మాట్లాడుతూ.. రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూములపైనే ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. తమ అనుమతి లేకుండా నోటిఫికేషన్లు, నోటీసులను జారీ చేయడం సరికాదన్నారు. నిమ్జ్ ప్రాజెక్టు జాబితా నుంచి తమ భూములను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచంధర్, ఆయా గ్రామాలకు చెందిన బాధిత రైతులు పునీత్ దీక్షిత్, నారాయణరావు, గుండారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గాలిరెడ్డి, శివరాజ్, రాములు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.