మెదక్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): ఏడు నెలలుగా వేతనాలు లేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ వైద్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలోని ఐసీయూ, బ్లడ్ బ్యాంక్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ వైద్యులకు ఏడు నెలలుగా వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది.
ఒకవైపు పెరుగుతున్న పని ఒత్తిడి, మరోవైపు ఆర్థిక సమస్యలు వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గట్టిగా నిలదీస్తే పైస్థాయిలో వేధింపులు తప్పడం లేదని వాపోతున్నారు. తీరిక లేని విధులతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విరామం లేకుండా విధులు నిర్వహిస్తుండడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు రెండు లేక మూడు నెలలకోసారి ఇవ్వడంతో ఆర్థికంగా దెబ్బతింటున్నారు.
మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలోని ఐసీయూ, బ్లడ్ బ్యాంక్లో డాక్టర్లు, సిబ్బంది 32 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో ఐదుగురు డాక్టర్లు కాంట్రాక్ట్ పద్ధతిన, ఆరుగురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ ఒకరు, ఎక్స్రే టెక్నీషియన్ ఒకరు, వెంటిలేటర్ టెక్నీషియన్ ఒకరు, ఎంఎన్వోలు ఆరుగురు, ఐఎన్వోలు ఇద్దరు, సెక్యూరిటీ గార్డులు ముగ్గురు ఉన్నారు. బ్లడ్ బ్యాంక్లో స్టాఫ్ నర్సులు ఇద్దరు, ల్యాబ్ టెక్నీషియన్లు ఇద్దరు, డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండర్, డైవర్ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. డాక్టర్లకు నెలకు రూ.50వేల వేతనం, మిగతా సిబ్బందికి రూ.15 వేలు, కొందరికీ రూ. 20వేల చొప్పున ఇస్తున్నారు. ఏడు నెలల వేతనాల బకాయిలు ఉన్నాయి.
ఒకవైపు తెలంగాణ వైద్య విధాన పరిషత్, మరోవైపు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పెండింగ్ వేతనాల చెల్లింపుల్లో తమది కాదంటే తమది కాదంటూ చేతులెత్తేస్తున్నాయి. దీంతో రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ డాక్టర్లు నలిగిపోతున్నారు. మెదక్ పట్టణ శివారులోని పిలికొట్యాల సమీపంలో నూతనంగా మెడికల్ కళాశాల ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో జిల్లా కేంద్ర దవాఖాన ఇటు, వైద్య విధాన పరిషత్ అటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తున్నాయి.
ఐసీయూ, బ్లడ్ బ్యాంకుల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ డాక్టర్లకు మెడికల్ కళాశాల ప్రారంభం కాకముందే ఉన్న రెండు నెలల పెండింగ్ వేతనాలతో పాటు మరో ఐదు నెలల వేతనాలు అందలేదు. వేతనాల విషయమై టీవీవీపీ అధికారులను అడగగా, దవాఖానను డీఎంఈ పరిధిలోకి మార్చినందున వేతనాలు ఆ శాఖనే చెల్లిస్తుందని సమాధానం ఇస్తున్నారని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. డీఎంఈ అధికారులను అడిగితే దవాఖాన తమ శాఖ పరిధిలోకి వచ్చినట్టు తమకు అధికారికంగా ఉత్తర్వులు రాలేదని చెబుతున్నారని అంటున్నారు. దీంతో రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో తమకు వేతనాలు రావ డం లేదని కాంట్రాక్ట్ డాక్టర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐసీయూలో పనిచేస్తున్న తమకు ప్రతినెలా వేతనం అందించాలి. ఏడు నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ భారంగా మారింది. అప్పులు తెచ్చి కుటుంబాలను పోషించుకుంటున్నాం. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు స్పందించి వేతనాలు ఇప్పించాలి.
– బాలమణి, ఐసీయూ స్టాఫ్ నర్సు
సర్కార్ వేతనాలు విడుదల చేయాలి. అన్నింటికీ అప్పులు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని సంతోషపడ్డాం. నెల నెలా జీతం వస్తుందని అనుకున్నాం. ఏడు నెలలుగా జీతం రాకపోతే కుటుంబం ఎలా బతుకుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు ఇవ్వాలి.
– బషీర్, బ్లడ్ బ్యాంక్ అటెండర్
రెండు శాఖల మధ్య సమన్వయం లేకనే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ డాక్టర్లకు వేతనాలు రావడం లేదు. ఇప్పటికే తలకు మించిన అప్పులు చేసి కష్టపడుతున్నాం. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతు న్నాం. ఏడు నెలల వేతనాలు ఒకేసారి చెల్లించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
– శివకుమార్, ఐసీయూ ల్యాబ్ టెక్నీషియన్