నారాయణఖేడ్, నవంబర్ 1 : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నామని నారాయణఖేడ్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో వెంకటేశం తెలిపారు. బుధవారం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, 13న నామినేషన్ల పరిశీలన, 15న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ నామినేషన్లను సంబంధించిన పత్రాలు, అఫిడవిట్లను జతపర్చి సమర్పించాలన్నారు. అదే విధంగా అభ్యర్థులు నామినేషన్ల సమర్పణ కోసం ఎన్కోర్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని, నమోదు చేసిన సమయానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పత్రాలను సమర్పించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. వాహనాల అనుమతి కోసం సువిధ యాప్‌ను, ఏవైనా అవాంఛనీయ ఘటనలకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు సీ విజిల్ యాప్‌ను అందుబాటులోకి తేచ్చామన్నారు.
ఇప్పటివరకు ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలో 2,29,309 మంది ఓటర్ల పేర్లను ఓటరు జాబితాలో చేర్చామని, ఈనెల 10వ తేదీ వరకు తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామన్నారు. నియోజకవర్గంలో మొత్తం 296 పోలింగ్ కేంద్రాలు ఉండగా 66 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని, వీటితోపాటు మరో 155 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ సదుపాయం కల్పించడమే కాకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీని అందుబాటులో ఉంచుతామన్నారు. నియోజకవర్గంలో ఎనిమిది ఆదర్శ పోలింగ్ కేంద్రాలను, ఐదు మహిళా పోలింగ్ కేంద్రాలను, ఒక యూత్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు రూ.52 లక్షల నగదును సీజ్ చేసినట్లు ఆర్డీవో వెంకటేశం చెప్పారు. సమావేశంలో స్థానిక తహసీల్దార్ దేవదాస్ ఉన్నారు.