శివ్వంపేట, డిసెంబర్ 5 : మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నామినేషన్ల చివరి రోజు ఉత్సహ భరిత వాతావరణంలో ముగిసింది. బీఆర్ఎస్ మద్దతు దారుల అభ్యర్థులు డప్పు చప్పుళ్లు, బ్యాండ్ మేళాలతో నామినేషన్లకు రావడంతో మండల వ్యాప్తంగా మద్దతుదారుల జెండాలు, నినాదాలతో ఊరేగింపులతో ఉత్సాహాన్ని హోరెత్తించాయి. నామినేషన్ల మూడవ రోజు అట్టహాసంగా సాగి రాజకీయ వేడి మరింత పెంచింది.
ఉదయం నుంచే మద్దతుదారులు గులాబీ కండువాలతో భారీ సంఖ్యలో చేరుకున్నారు. నామినేషన్ల చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఒకరికొకరు సమన్వయంగా తమ బలం ప్రదర్శించుకున్నారు. పోలీసులు భారీ ర్యాలీలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్త్ ఏర్పాటు చేశారు.