Dhoolmitta | మద్దూరు(ధూళిమిట్ట), మార్చి21: ధూళిమిట్ట గ్రామం చుట్టూ పెద్దవాగు విస్తరించి ఉండడంతో గ్రామాన్ని ఓ ద్వీపకల్పంగా పిలిచేవారు. ఊరికి మణిహారంలా ఉన్న పెద్ద వాగే.. ఊళ్లోని జనాలకు అదెరువు. వాగు పారితేనే వారికి బతుకుదెరువు. పెద్దవాగు(మోయితుమ్మెద)లోని నీటిబొట్టును ఒడిసిపట్టుకునేందుకు గతంలో వాగుపై చెక్‌డ్యాంలను నిర్మించారు. చెక్‌డ్యాంల నిర్మాణాలతో భూగర్భజలాలు అమాంతం పెరిగి బోరుబావులు ఎల్లబోసేవి. గత మూడేండ్లు క్రితం వరకు చెక్‌డ్యాంలు జలకళతో ఉట్టిపడేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. చెక్‌డ్యాంలలో చుక్క నీరు లేక బోసిపోతున్నాయి. వాగు ఎండిపోవడంతో బోరుబావులల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ధూళిమిట్ట గ్రామంలో సుమారు 500 ఎకరాలలో పంటలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం నీళ్లు లేక గ్రామంలోని పొలాలన్నీ బీటలుపారుతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. గ్రామంలోని పెద్ద చెరువు కూడా ఎండిపోవడంతో గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామంలో త్రాగేందుకు నీళ్లు కూడా దొరికే పరిస్థితి ఉండదని గ్రామస్తులు భయపడున్నారు.
2022 ఏప్రిల్ మాసంలో రంగనాయకసాగర్ నుంచి కాల్వల ద్వారా గ్రామంలోని పెద్ద చెరువుకు గోదావరి జలాలు రావడం జరిగింది. గోదావరి జలాలు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ పూజలు చేశారు. రెండేండ్ల పాటు గోదావరి నీళ్లు రావడంతో చెరువు నిండడమే కాకుండా కాల్వ చుట్టూముట్టూ ఉన్న రైతులు తమ పొలాలను పారించుకున్నారు. ప్రస్తుతం నీళ్లు లేక రంగనాయకసాగర్ కాల్వ పిచ్చి మొక్కలు, చెట్లతో దర్శనమిస్తుంది. రంగనాయకసాగర్ కాల్వలోకి నీటిని విడుదల చేసి గ్రామంలోని చెరువును నింపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ధూళిమిట్టలో భూగర్భజలాలు మొత్తం అడుగంటి పోయినయి. ఇంతకుముందు మాకు ఉన్న చెక్‌డ్యాంలలో కూడా నీళ్లు లేకుండా పదిహేను రోజులలోపే మొత్తం అడుగంటి పోయినయి. వాగులో కూడా కొన్ని బోర్లు ఎత్తిపోతున్నయి. గడ్డమీద బోర్లయితే పూర్తిగా ఎండిపోతున్నాయి. పోలాలు మొత్తం ఎండిపోతున్నయి. ఇంతకుముందు మాకు కాలేశ్వరం నీళ్లు రంగనాకసాగర్ నుంచి వచ్చేవి. ఇప్పుడా ఆ నీళ్లు రావడం లేదు. ధూళిమిట్ట అంటే బంగారు మిట్ట లెక్క ఉండేది. ఎన్కటి నుంచి కూడా చుట్టూ ముట్టూ ఊర్లకు మా ఊరు ఆదర్శంగా ఉండేది. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నయి. ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి.
-తుషాలపురం కనకయ్య, రైతు, ధూళిమిట్ట
నేను ఈ యాసంగిలో ఐదెకరాలలో వరి పంట వేసిన. బోర్లల్ల నీళ్లు లేక మూడున్నర ఎకరాలలో వరి పంట పూర్తిగా ఎండిపోయింది. ఎండిన వరి పంటను పశువుల మేత కోసం విడిచిపెట్టిన. ఉన్న ఎకరంన్నర కూడా పారెతట్టు లేదు. పొలం ఎండిపోవడంతో సుమారు రూ. 2లక్షల నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఎండిన వరి పంటకు నష్టపరిహారమిచ్చి ఆదుకోవాలి.
గుజ్జుల మల్లారెడ్డి, రైతు, ధూళిమిట్ట