మునిపల్లి, సెప్టెంబర్ 10 : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి గురుకుల బాలుర హాస్టల్ విద్యార్థులకు భద్రత కరువైంది. 40 ఏండ్ల్ల కింద నిర్మాణం చేపట్టిన పాఠశాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. ముంబయి జాతీయ రహదారికి కూతవేట దూరంలో ఉన్న పాఠశాలపై రాష్ట్ర మంత్రి, జిల్లా అధికారులు, మండల అధికారులు పర్యవేక్షణ చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం అధికారులు పర్యవేక్షణ చేస్తూ విద్యార్థుల బాగోగులు తెలుసుకుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాల హాస్టల్లో భవనం నెలమట్టమైనట్లు తెలియగానే కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు పరుగులు పెట్టారు. గురుకుల పాఠశాలలో సమస్యలు ఉన్నాయంటూ గతంలో అధికారులకు సంబంధిత పాఠశాల సిబ్బంది పలుమార్లు ఫిర్యాదు చేసినా ఏఅధికారి అటు వైపు కన్నెత్తి చూడలేదు. గురుకుల పాఠశాలలో జరిగిన ప్రమాదంలో విద్యార్థులకు ఎలాం టి ప్రమాదం జరగలేదన్న సమాచారం అందుకున్న జిల్లా అధికారులు నిమిషాల్లో పాఠశాలకు చేరుకోవడం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇది వరకే హాస్టల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేదికాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాల,కళాశాలలో ఐదోతరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యను అందిస్తుండగా 641మంది చదువుకుంటున్నారు. వసతి గృహం నెలమట్టమైన రోజు హాస్టల్లో 601 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల బాగోగులపై ప్రభుత్వం సరిగ్గా దృష్టి పెట్టకనే వసతి గృహం కూలిపోయిందని స్థానికులు మండిపడ్డారు.
లింగంపల్లి గురుకుల పాఠశాల భవనం 40 ఏండ్ల కింద నిర్మించారు. శిథిలావస్థకు చేరి నేలమట్టమైన విషయం తెలిసిందే. పది రోజులు కురిసిన భారీ వర్షానికి భవనం మొత్తం తడిసి నేల మట్టమైంది. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకొని లింగంపల్లి గురుకుల పాఠశాలకు సంబంధించి నూతన బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మించాలి. విద్యార్థులు లేని సమయంలో వసతి గృహం కూలడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. మరికొన్ని గదులు శిథిలావస్థలో ఉన్నం దున మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా మంత్రి స్పందించాలి. నూతన వసతి గృహం భవనం, కళాశాల బిల్డింగ్,డైనింగ్‌హాల్ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలి.
-చంటి క్రాంతికిరణ్,అందోల్ మాజీ ఎమ్మెల్యే
లింగంపల్లి గురుకుల పాఠశాల,కళాశాలలో చదువుకునే విద్యార్థులంతా బాగానే ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగ లేదు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను పర్మిషన్ మీద ఇంటికి తీసుకువెళ్తున్నారు. హాస్టల్లో ఉండే పిల్లలకు ఎప్పటిలాగే తరగతులు నిర్వహిస్తున్నాం. తరగతి గదుల్లో విద్యార్థులు ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్‌ను నేలమట్టం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
-చైతన్య, లింగంపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, సంగారెడ్డి జిల్లా