Daily Labourers | నర్సాపూర్, అక్టోబర్ 6 : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జీతాలు పెంచితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలలో కోత విధించిందని ఆశ్రమ వసతి గృహాల రోజువారి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నర్సాపూర్ మున్సిపాలిటీలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వద్ద గిరిజన ఆశ్రమ వసతిగృహాలు, పాఠశాలలో పనిచేస్తున్న రోజువారి కూలీలు నిరవధిక దీక్ష చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకు రూ.13,600 జీతం చెల్లించేవారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నెలకు రూ.10,400 మాత్రమే చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జీతం తగ్గిందని, పని భారం పెరిగిందని ఆక్రోశం వెళ్లగక్కారు. అదే కాకుండా గత ఎనిమిది నెలల నుండి జీతాలు చెల్లించడం లేదని, బయట మిత్తిలకు అప్పుచేసి కుటుంబాన్ని సాకుతున్నామన్నారు. ఈ విషయంపై డిటిడిఓ ను అడిగితే మీవి దగ్గితే, తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలని, మీ ఇష్టం ఉంటే చేయండి లేకపోతే వెళ్లిపోండి అని అవహేళన చేశారని బాధపడ్డారు.
గత ప్రభుత్వంలో నెలనెలా జీతాలు..
ప్రజావాణిలో మా సమస్యలపై మంత్రికి కూడా విన్నవించుకున్నామని.. అయినా ఫలితం లేదని పేర్కొన్నారు. మాకు కలిగే బాధ అధికారులకు కలిగితే తెలిసి వస్తుందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో నెలనెలా జీతాలు సక్రమంగా వచ్చేవని.. కానీ ఈ ప్రభుత్వంలో జీతాలే రావడంలేదని అసహనం వ్యక్తం చేశారు. బయట కూలికి పోతే రోజుకి రూ.600 నుండి రూ. 900 వరకు వస్తుందని మాకు మాత్రం రూ.400 కూడా రావడంలేదని అన్నారు. 25 రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, టైం స్కేల్ చేయాలని, అప్పటివరకు కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు చెల్లించాలని, మరణించిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పూర్తి కాలం పనిచేస్తున్న వారందరికీ పూర్తి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రోజువారీ కూలీలు నర్సింలు, కిషన్, సురేష్, లక్ష్మీనారాయణ, నరేష్, స్వరూప, మాధవి, వాలి, రేనా, పెంటమ్మ, భాగ్య, రజిత, సువర్ణ, జానకి, జ్యోతి, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
BJP MP | వరద బాధితులకు సాయం చేస్తుండగా దాడి.. ఎంపీకి తీవ్ర గాయాలు
BC Reservations | బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు