పటాన్చెరు, జూలై 5: పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, ఇతర సిబ్బంది ప్రాణాలకు భద్రత కరువైంది. పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో అమాయక కార్మికులు కాలిబూడిదవుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఆసియా ఖండంలోనే పెద్ద పారిశ్రామికవాడ ఉంది. పటాన్చెరు, బొల్లారం, ఖాజీపల్లి, పాశమైలారంతో పాటు పలు ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. దేశంలోని బీహారు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కాంట్రాక్టర్ల ద్వారా కార్మికులను నియమించుకుంటున్నాయి.
ఫ్యాక్టరీల్లో చేరిన కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పరిశ్రమల యజమానులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు తనిఖీల పేరిట హడావిడి చేసి, మిగతా సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదాలు నివారించేందుకు పరిశ్రమల యాజమాన్యాలు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.ముఖ్యంగా రసాయన పరిశ్రమల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగి అధికంగా కార్మికులు మృతిచెందడంతో పాటు తీవ్రగాయాలకు గురవుతున్నారు.
పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదంతో దేశం చూపు పాశమైలారం వైపు పడింది. జాతీయ మీడియా సంస్థలు సైతం యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిందని ప్రచారం చేశాయి. రసాయన పరిశ్రమలను తనిఖీలు చేసి సరైన పరికరాలు లేని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. పాశమైలారం పారిశ్రమిక వాడలోని వెంకర్ కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఈ ఏడాది ఏప్రిల్ 17న భారీ ప్రమాదం జరిగింది. అంతకుమందు మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. పాశమైలారం పారిశ్రామిక వాడలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సిగాచి లాంటి ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
పటాన్చెరు, పాశమైలారం, బొల్లారం, ఖాజీపల్లి, గుమ్మడిదల, జిన్నారం ప్రాంతంలో రసాయన, ఫార్మా ఫ్యాక్టరీలతో పాటు వస్త్ర, రసాయన, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి . వీటితో పాటు పలు రకాల వస్తువులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు నడుస్తున్నాయి. పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలు అమలు చేయడం లేదు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచడం లేదు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ధరించడం తప్పనిసరిగా ఉండాలి.
యంత్రా లు, పరికరాలను నిత్యం పరీక్షించి మెయింటెనెన్స్ చేయాలి. లోపాలు ఉన్న పరికరాలు ఉపయోగించకుండా తక్షణం మరమ్మతులు చేయాలి. కార్మికులు పనిచేసే ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినా తక్షణం గట్టెక్కడానికి అవసరమైన మార్గాలు ఏర్పాటు చేయాలి. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోతున్నా నివారణ చర్యలు తీసుకోవడం లేదు.
చిన్న, మధ్యతరహా రసాయన పరిశ్రమల్లో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పరిశ్రమల్లో కనీస భద్రత ప్రమాణాలు పాటించడం లేదు. పరిశ్రమల్లో రికార్డులను తనిఖీలు చేసి అధికారులు వెళ్తున్నారు తప్పా క్షేత్రస్థాయిలో పరిశ్రమలను తనిఖీ చేసి లోపాలు గుర్తించడం లేదు. క్షేత్రస్థాయిలో పరిశ్రమలను తనిఖీ చేస్తే లోపాలు గుర్తించి, పరిశ్రమల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలి. ప్రతి ఏడాది వేసవికి మందే చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలను తనిఖీ చేసి అగ్నిమాపకశాఖతో పాటు పలు శాఖలఅధికారులు ఎన్వోసీలు అందజేయాలి. కానీ, అలా జరగడం లేదు. పరిశ్రమల్లో అగ్నిమాపక పరికరాల నిర్వహణ సక్రమంగా లేక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
రియాక్టర్లు, బాయిలర్లు, పొగగొట్టాలు, ఇతర యంత్రాల వద్ద రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు అనుభవం ఉన్న కార్మికులను పనిలో పెట్టుకోవడం లేదు. రియాక్టర్లు, బాయిలర్లు వద్ద ప్రమాదాలు పసిగట్టి కార్మికులను అప్రమత్తం చేసే సాంకేతిక పరికరాలు ఏర్పాటు చేయడం లేదు. గ్యాస్ లీకేజీలకు ఆస్కారం లేకుండా పర్యవేక్షణ చేయాలి. కానీ, రసాయన ఫ్యాక్టరీల్లో ఎక్కడా నివారణ చర్యలు తీసుకోవడం లేదు. గతేడాది పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో బాయిలర్లు పేలి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అధికారులు చర్యలు తీసుకుంటామని ప్రకటనలు చేశారు తప్పా చర్యలు తీసుకోలేదు. దీంతో పరిశ్రమల యజమానులు ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు.
పటాన్చెరు, పాశమైలారం, బొల్లారం, జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాల్లో భారీ, చిన్న ,మధ్య తరహా రసాయన పరిశ్రమలు వందలాదిగా ఉన్నాయి. వీటిలో తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ర్టాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికుల భద్రత విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పలు పరిశ్రమల యజమానులు కాంట్రాక్టర్ల ద్వారా రోజువారీ కూలీలను తీసుకువచ్చి పనిచేయిస్తున్నారు. కార్మికుల భద్రత కోసం దుస్తులు, హెల్మెట్, మాస్కులు ఇవ్వడం లేదు.
పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన సమయంలో రక్షణ పరికరాలు లేక కార్మికులు తీవ్ర గాయాలకు గురైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమలను తనిఖీ చేసే పలుశాఖల అధికారులు యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రసాయన పరిశ్రమల్లో పని చేసేందుకు బీఎస్సీ కెమికల్ చదువుకున్న వారిని నియమించాలి. అనుభవం ఉన్న ప్లాంట్ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, మెకానిక్, ఫిట్టర్ , ఎలక్ట్రిషియన్, సేఫ్టీ అధికారి ఉద్యోగాలకు కనీసం అనుభవం ఉన్న వారిని నియమించడం లేదు. అనుభవం లేని కార్మికులను రసాయన పరిశ్రమల్లో పనిలోకి తీసుకోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.