సంగారెడ్డి, మే 4(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది నవోదయ విద్యాలయం ప్రారంభమయ్యే అవకాశం లేదు. కేంద్రం జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరు చేసినప్పటికీ ఈ ఏడాది విద్యార్థుల అడ్మిషన్లు జరగడం లేదు. 2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం కేంద్రం మూడు రోజుల క్రితం విడుదల చేసిన నోటిఫికేషన్లో సంగారెడ్డి నవోదయ విద్యాలయం పేరు చేర్చలేదు. దీంతో సంగరెడ్డి జిల్లాలో ఈ ఏడాది నవోదయ విద్యాలయం, తరగతులు ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు.
నవోదయ విద్యాలయంలో తమ పిల్లలను చేర్పించాలని ఆశపడిన తల్లిదండ్రులకు నిరాశ మిగిలింది. 2025-26 విద్యా సంవత్సరంలోనే నవోదయ తరగతులు ప్రారంభించేందుకు వీలుగా సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూలో తాత్కాలిక క్యాంపస్‌ను జిల్లా యంత్రాంగం సిద్ధ్దం చేసింది. అయినప్పటికీ కేంద్రం నవోదయ తరగతుల ప్రారంభానికి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో మోదీ సర్కార్ తీరుపై ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు కోసం బీఆర్ఎస్ సర్కార్ తీవ్రంగా కృషిచేసింది. జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధాని నరేంద్రమోదీ సర్కార్‌పై ఒత్తిడి తెచ్చారు. కేసీఆర్ సర్కార్ కృషి ఫలితంగా మోదీ సర్కార్ గతేడాది డిసెంబర్లో సంగారెడ్డి జిల్లాకు జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది.
ఏండ్ల తర్వాత సంగారెడ్డికి నవోదయ విద్యాలయం మంజూరైతే అది ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై కాంగ్రెస్, బీజేపీలు పోరుకు దిగాయి. 6 డిసెంబర్, 2024న జిల్లాకు నవోదయ మంజూరైంది. నవోదయ విద్యాలయం ఏర్పాటు కోసం జిల్లా యంత్రాంగం ఏడు గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించింది. పటాన్చెరు మండలంలోని ఐనోల్(30 ఎకరాలు), జహీరాబాద్ మండలంలోని ఖాసింపూర్(35 ఎకరాలు), కల్హేర్ మండలంలోని బాచేపల్లి(30 ఎకరాలు), పుల్కల్ మం డలంలోని బస్వాపూర్(30 ఎకరాలు), అమీన్పూర్(25 ఎకరాలు), అందోల్(20 ఎకరాలు), మనూరు మండలంలోని తిమ్మాపూర్(30 ఎకరాలు)లో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వ భూములు ఉన్నట్లు జిల్లా యంత్రాంగం నవోదయ విద్యా సమితికి నివేదిక అందజేసింది.
జిల్లా యంత్రాంగం నివేదిక అనుగుణంగా నవోదయ విద్యాలయం ఏర్పాటు కోసం నవోదయ విద్యాలయ ఉన్నతాధికారులు ఏడు ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఇదే సమయంలో కొత్తగా మంజూరైన నవోదయ విద్యాలయం ఏర్పాటు విషయమై కాంగ్రెస్, బీజేపీ పోరుకు దిగాయి. జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయం తన అందోల్‌లో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి దామోదర రాజనర్సింహా పట్టుబడుతున్నట్లు తెలిసింది. మరోవైపు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అమీన్పూర్లో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై ఇద్దరు ప్రజాప్రతినిధులు ఎవరికి వారే పైచేయి సాధించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్రం నవోదయ విద్యాలయం మంజూరు చేసినప్పటికీ అది ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విచక్షణాధికారమని మంత్రి దామోదర రాజనర్సింహా చెబుతున్నట్లు సమాచారం.
కేంద్రం నవోదయ మంజూరు చేయడంతో పాటు భవన నిర్మాణంకు నిధులు ఇస్తున్నందున తాను సూచించిన అమీన్‌పూర్‌లోనే నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని ఎంపీ రఘునందన్ పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఇద్దరు నేతలు ఎవరికివారే తమ ప్రాంతాల్లో నవోదయ విద్యాలయం కోసం పట్టుబడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక భవనం సిద్ధ్దం చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించినట్లు తెలుస్తుంది. కేంద్రం సూచన మేరకు జిల్లా యంత్రాం గం చౌటకూరు మండలం సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూలో నవోదయ విద్యాలయాన్ని ప్రారంభించేందుకు వీలుగా తాత్కాలిక క్యాంపస్‌ను సిద్ధ్దం చేసింది. నవోదయ విద్యాలయం తరగుతుల కోసం ఓ భవనం, హాస్టల్ కోసం మరో భవనాన్ని సిద్ధం చేశారు.
నవోదయ విద్యాలయం ప్రారంభం కోసం సుల్తాన్పూర్ జేఎన్టీయూలో తాత్కాలిక క్యాంపస్ సిద్ధం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరంలో నవోదయ విద్యాలయం ప్రారంభానికి పచ్చజెండా ఊపలేదు. 2025-26 విద్యా సంవత్సరానికి నవోదయ విద్యాలయాల్లో విద్యార్థుల ప్రవేశం కోసం కేంద్రం విడుదల చేసే నోటిఫికేషన్లో సంగారెడ్డి జిల్లా నవోదయ విద్యాలయం పేరు చేర్చలేదు.
6 నుంచి 10వ తరగతిలో విద్యార్థులను చేర్చుకునేందుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈనెల 1న కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్లో సంగారెడ్డి జిల్లా నవోదయ విద్యాలయం లేదు. దీంతో ఈ ఏడాది నవోదయ విద్యాలయంలో తరగతులు ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేకపోవడంతో మన విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.