నర్సాపూర్ : ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులకు నచ్చిన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని బాధితుడు కుమ్మరి నరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నరేశ్ తన చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మతాతయ్యల దగ్గర పెరిగాడు. తమకున్న పెంకుటిళ్ళు శిథిలావస్థకు చేరడంతో మూడేళ్ల క్రితం ఆ ఇంటిని కూల్చేసి అద్దె ఇంట్లో ఉంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం నరేష్ తన నానమ్మ పేరుపై ధరఖాస్తు చేసుకున్నాడు. దాంతో కమిటీ సభ్యులుగా ఉన్న గ్రామ కాంగ్రెస్ నాయకులు, అధికారులు తప్పకుండా ఇల్లు ఇప్పిస్తామని భరోసానిచ్చారు. తీరా ఇళ్లు మంజూరైన తర్వాత ఆ జాబితాలో తన నానమ్మ పేరు లేకపోవడంతో నిరాసకు గురయ్యాడు.
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ కార్యకర్త అయినప్పటికి తనకు ఇల్లు రాకపోవడం సిగ్గుచేటుగా ఉందని బాధితుడు నరేష్ ఆవేదన వ్యక్తంచేశాడు. కాంగ్రెస్ కార్యకర్త అయిన తనకే ఇల్లు మంజూరు కాకపోతే ఇతర ప్రజల పరిస్థితి ఏమిటని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు వాళ్లకు నచ్చిన వాళ్లకు, అనుకూలమైన వాళ్లకే ఇండ్లను మంజూరు చేయించారని ఆరోపించాడు.
ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో ఉన్న ఓ కాంగ్రెస్ కార్యకర్త ఇందిరమ్మ ఇంటికి ధరఖాస్తు చేసుకున్న తర్వాత తన ఇల్లును కూలగొట్టుకోగా అతనికి ఇల్లు మంజూరు అయ్యిందని తెలిపాడు. ఇప్పటికైనా అధికారులు, కాంగ్రెస్ నాయకులు స్పందించి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి న్యాయం చేయాలని కోరాడు.