సిద్దిపేట అర్బన్, జూన్ 16 : ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లల్ని చేర్పించండి అంటూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట చేపట్టినా చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అనాసక్తి చూపుతున్నారు. ఆ పాఠశాలలో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది.
ఎందుకంటే ఆ పాఠశాలలో చేరేందుకు ఎంతో మంది వేచి చూస్తారు. అదే సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పదేండ్లుగా పాఠశాల ప్రారంభంలోనే నో అడ్మిషన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న ఇందిరానగర్ ప్రభు త్వ పాఠశాలపై ప్రత్యేక కథనం.
ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు బోధిస్తారు. ఈ పాఠశాలలో 1200కు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల ప్రారంభమై కేవలం నాలుగు రోజులకే పాఠశాలలోని అన్ని తరగతుల్లో సీట్లు నిండిపోయాయంటే ఆ పాఠశాలకు ఉన్న క్రేజ్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఈ పాఠశాలను దత్తత తీసుకొని పలు ట్రస్టులు, ఎన్జీవోల సహాయంతో పాఠశాలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు.
పాఠశాలలో డిజిటల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, గూగుల్ ఫ్యూచర్ క్లాస్ సదుపాయం, సోలార్ పవర్ యూనిట్, మోటల్ వంటశాల, వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాల ప్రతి రికార్డును ఆన్లైన్లోనే నిక్షిప్తం చేసి ఉంచుతారు. ఉపాధ్యాయుల చొరవ, విద్యార్థుల ఉత్సాహంతో పాఠశాల దినాదినాభివృద్ధి చెందింది. ఈ పాఠశాలలో ఇఫ్లూ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు ఇంగ్లిష్తో పాటు ఫ్రెంచ్, స్పానిష్ భాషలను నేర్పిస్తారు.అన్ని రకాల పోటీ పరీక్షల్లో ఇందిరానగర్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు.