నిజాంపేట, సెప్టెంబర్14: యూరియా కోసం అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. రోజు రోజుకూ యూరియా సమస్య జఠిలమవుతున్నది. యూరియా పంపిణీలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఆదివారం మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట పీఏసీఎస్ సొసైటీకి వచ్చిన యూరియా కోసం రైతులు ఉదయం నాలుగు గంటల నుంచే క్యూలో నిల్చున్నారు. ఒక్కో రైతుకు ఒక యూరియా బస్తా మాత్రమే సిబ్బంది పంపిణీ చేశారు. సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రామాయంపేట, సెప్టెంబర్14: రైతులకు యూరియా కష్టాలు తప్పేటట్లు లేవు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని అక్కన్నపేటలో ఉదయమే రైతులు యూరియా కోసం రైతువేదిక వద్ద బారులుతీరారు. యూరి యా లారీ పది గంటలకు వచ్చింది. దీంతో టోకెన్లు ఇచ్చి అధికారులు యూరియా బస్తాలు అందజేశారు.ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొంతమంది వ్యాపారులు కావాలనే దొంగచాటుగా విక్రయాలు జరిపి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు మండిపడ్డారు.