జహీరాబాద్, జూలై 11 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని నిమ్జ్ ప్రాజెక్టు కార్యాలయం అవినీతిమయంగా మారింది. డబ్బులు ఇస్తేనే పరిహారం చెల్లించే ఫైల్ ముందుకు వెళ్తుందని, డబ్బులు ఇవ్వకుంటే పరిహారం చెక్కు కోసం కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని పలువురు భూ బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని 17 గ్రామాల్లో సుమారు 12,600 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో 7700 ఎకరాల వరకు భూమిని సేకరించారు. ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోతున్న పట్టా, ప్రభుత్వ భూముల బాధిత రైతులకు ఎకరానికి రూ. 15 లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లిస్తున్నారు.
కోట్లాది రూపాయల విలువ చేసే భూములకు లక్షల్లోనే పరిహారం చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిమ్జ్ అధికారులు భూముల పరిహారం చెల్లింపు చెక్కుల పంపిణీలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదే ఆసరాగా తీసుకుని నిమ్జ్ ప్రాజెక్టు కార్యాలయంలో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది గ్రామానికి ఒక బ్రోకర్‌ను నియమించుకుని డబ్బులు వసూలు చేస్తున్నారని భూ బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో భూములు కోల్పోయిన బాధిత రైతులకు పరిహారం చెక్కు ఇవ్వాల్సి వస్తే భూమిపై కేసు ఉందని, అది క్లియర్ చేస్తేనే చెక్కు ఇస్తామంటూ కార్యాలయం చుట్టూ తిప్పుకొంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిమ్జ్ ప్రాజెక్టు అధికారులు నియమించుకున్న బ్రోకర్‌ను బాధిత రైతులు ఆశ్రయిస్తే అడిగినంత డబ్బులు మట్టచెప్పితేనే పరిహారం చెక్కు అందిస్తున్నారని తెలిపారు. ఏసీబీ అధికారులు దాడులు చేసి అదనపు కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, కారు డ్రైవర్‌ను పట్టుకోవడంతో ని మ్జ్ కార్యాలయంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న అవినీతిదందా బహిర్గతమైం ది. జిల్లా ఉన్నతాధికారులు నిమ్జ్ భూసేకరణను వేగవం తం చేయాలని ఆదేశించడం తో సంబంధిత అధికారులు ఇదే మంచి తరుణం అనుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
భూములు కోల్పోయిన చిన్న, సన్నకారు రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని సంబంధిత నిమ్జ్ అధికారు లు పరిహారం చెక్కులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి దొరికిపోయారు. 2024లో కూడా నిమ్జ్ ప్రాజెక్టులో భూమి కోల్పోయిన న్యాల్కల్ మండలంలోని గణేశ్‌పూర్ గ్రామానికి చెందిన రైతుకు పరిహారం చెక్కు చెల్లింపు కోసం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దుర్గయ్య రూ. 70 వేల లంచం అడిగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న బాధితులకు త్వరలో పరిహారం చెక్కులు అందేలా చూడాలని ఆయా మండలాల భూ బాధిత రైతులు కోరుతున్నారు.