హైదరాబాద్: స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు పోరుబాటపట్టాయి. ఇందులో భాగంగా ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలంటూ తెలంగాణ బంద్‌కు (BC Bandh) పిలుపునిచ్చాయి. దీనికి బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు, వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మద్దతు తెలిపాయి. దీంతో శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచే బంద్ కొనసాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల్లో నుంచి బస్సులు బయటకు రాలేదు. జిల్లాలు, అంతర్రాష్ట్ర సర్వీసులు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్కే పరిమితమయ్యాయి. రాజేంద్రనగర్, దిల్సుఖ్నగర్, బండ్లగూడ, హయత్‌నగర్, బర్కత్‌పురా, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మేడ్చల్, పటాన్‌చెరూ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి.
జేబీఎస్, ఎంజీబీఎస్ వద్ద, రాజేంద్ర నగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్, సూర్యాపేట, గద్వాల,ఆదిలాబాద్, సిరిసిల్ల, వేములవాడ, ఖమ్మం, మెదక్ సహా అన్ని జిల్లాల్లో ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు, అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. బస్సులు బయటకు రాకుండా డిపోల ముందు బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మహబూబ్‌నగర్‌లో బస్ డిపో ముందు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్లే బీసీ రిజర్వేషన్లు అమల్లోకి రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలపడంతో దుకాణాలు తెరచుకోలేదు. దీంతో జన జీవనం స్తంభించిపోయింది. బస్సుల కోసం రోడ్లపై ప్రజలు ఎదురుచూస్తున్నారు. బస్సులు నడవకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు.