హైదరాబాద్, అక్టోబర్ 17 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): చంద్రుడి మీద ఆవాసాల ఏర్పాటుకై ఏండ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అక్కడి సంక్లిష్ట వాతావరణం, భూమి మీద మెటీరియల్ను అక్కడికి తీసుకెళ్లి గృహాలను నిర్మించడం ఇంతవరకూ కష్టంగా మారింది. అయితే, మరికొద్ది రోజుల్లో ఇదంత కష్టమేమీకాదని నాసా పరిశోధకులు అంటున్నారు. జాబిల్లి మీద ఉన్న ధూళితో బుడగల్లాంటి ప్రత్యేక గాజు గృహాలను అక్కడే నిర్మించే సాంకేతికతను అభివృద్ధి చేయడమే దీనికి కారణం అంటున్నారు. ఈ మేరకు ఇంజినీరింగ్ కంపెనీ స్కైపోర్ట్స్తో నాసా జతకట్టింది. రాకెట్ ప్రయోగాలు మరింత చవగ్గా నిర్వహించేందుకు, వ్యోమగాములు నివసించేందుకే ఈ గృహాల నిర్మాణాన్ని చేపడుతున్నట్టు నాసా పరిశోధకులు తెలిపారు.
2028లో ఆర్టెమిస్-4 ప్రయోగం ద్వారా చంద్రుడి మీద స్పేస్ స్టేషన్ను నిర్మించే ప్రణాళికలో నాసా ఉన్నది. అంతకుముందే ఈ గృహాలను నిర్మించనున్నట్టు సమాచారం.
చంద్రుడి మీద ఉన్న ధూళిలోని సిలికేట్స్కు టైటానియమ్, మెగ్నీషియం, కాల్షియమ్ వంటి మెటల్స్ను జోడించి అత్యంత ఉష్ణోగ్రతల వద్ద ఈ గాజు గృహాలను సిద్ధం చేస్తారు. వెయ్యి అడుగుల ఎత్తు, 1,600 అడుగుల వెడల్పుతో గోళాకారంలో ఈ గృహాలు ఉంటాయి.
తొలుత ఆక్సిజన్ సిలిండర్లు, నీటి ద్వారా అక్కడ మొక్కలను పెంచి క్రమంగా వాతావరణాన్ని సిద్ధం చేయనున్నట్టు పరిశోధకులు చెప్తున్నారు. సూర్యకాంతితో విద్యుదుత్పత్తి జరుగుతుందని అంటున్నారు.