న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు (Pak Afghan Clashes) కొనసాగుతున్నాయి. ఈ నెల 14న తాలిబన్ సైనిక స్థావరాలపై పాక్ సైన్యం పెద్దఎత్తున దాడులకు పాల్పడింది. దీంతో తాలిబన్ సైన్యం కూడా ప్రతిదాడులకు దిగడంతో సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాల మధ్య భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అయితే 48 గంటల పాటు కాల్పుల విరమణ పాటించాలని రెండు దేశాలు నిర్ణయించడంతో దాడులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. తాజాగా రెండ్రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్.. అఫ్ఘాన్‌పై మరోసారి దాడులకు దిగింది. డ్యారాండ్ లైన్ వెంబడి అఫ్ఘాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పాక్ వైమానిక దాడులకు (Airstrikes) పాల్పడింది. దీంతో పది మంది మరణించారు. వారిలో ముగ్గురు అఫ్ఘాన్ దేశవాళి క్రికెటర్లు కూడా ఉన్నారు. మృతిచెందిన క్రికెటర్లను కబీర్, సిబాతుల్లా, హరూన్గా గుర్తించారు.
కాగా, పాక్ కాల్పులను తాలిబన్ పాలకు దృవీకరించారు. పాక్టికా ప్రావిన్స్‌లోని పలు జిల్లాల్లో పాకిస్థాన్ వైమానిక దాడులు చేసిందని తాలిబన్ సీనియర్ అధికారి చెప్పారు. దీంతో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని వెల్లడించారు. అర్గున్, బెర్మల్ జిల్లాల్లో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. శనివారం అఫ్ఘాన్, పాక్ మధ్య ఖతార్‌లో శాంతి చర్చలు జరుగనున్న నేపథ్యంలో ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. ఇప్పటికే పాక్ ప్రతినిధులు ఖతార్ రాజధాని దోహాకు చేరుకున్నారు. శనివారం తాలిబన్ ప్రతినిధులు కూడా అక్కడి చేరుకునే అవకాశం ఉందని రాయిటర్స్ వెల్లడించింది.