సిద్దిపేట, మార్చి 09 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విద్య, ఉద్యోగాల నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను తీసుకురావడంతో నిరుద్యోగులకు వరమైంది. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్త్తీ చేస్తామని బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏ ఏడాది ఎన్ని పోస్టులను గుర్తిస్తే, అదే ఏడాది పోస్టులను భర్తీచేసేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది..ఇక నుంచి కొత్త జోనల్ విధానం మేరకు ఉద్యోగాల భర్తీ చేసేలా, ఎప్పటికప్పుడు ఉద్యోగాల నియామకాల కోసం వార్షిక క్యాలెండర్‌ను ప్రభుత్వం తయారు చేయనుంది. దీంతో దశాబ్దాలుగా సాగుతున్న మూస విధానానికి స్వస్తి చెప్పడమే కాకుండా స్థానికేతరుల రిజర్వేషన్ కోటాకు సైతం కళ్లెం వేసింది. ఎక్కడికక్కడే నిరుద్యోగులకు అవకాశాలు కల్పించేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాచారు. మల్టీజోన్ -1 కింద ..జోన్ -3లో (రాజన్న సిరిసిల్ల ) సిద్దిపేట, మెదక్ జిల్లాలు ఉన్నాయి. మల్టీజోన్ -2 కింద..జోన్-6లో(చార్మినార్ )కింద సంగారెడ్డి జిల్లా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ 10 జిల్లాలను 33గా చేశారు. దీంతో కొత్త జిల్లాలతో పాటుగా డివిజన్లు, మండలాలు ఏర్పాటయ్యాయి. గతంలో రెండు జోన్లుగా ఉన్న రాష్ర్టాన్ని ఏడు జోన్లుగా, రెండు మల్ట్టీజోన్లుగా మార్చింది. తద్వారా జిల్లాస్థాయి నుంచి మల్టీజోన్ వరకు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. మిగిలిన 5శాతం పోస్టులను ఓపెన్ కోటా ఉంటుంది. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ కాలం ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా కింద పరిగణనలోకి తీసుకుంటారు.కొత్త జోనల్ విధానం ద్వారా గతంలో ఉన్న వైశాల్యం తగ్గనుంది. దీంతో స్థానికంగానే ఉంటూ వారి జోన్ పరిధిలోనే ఎక్కడైనా ఉద్యోగం చేసుకునే సౌలభ్యం ఏర్పడింది. గతంతో పొల్చితే నూతన జోనల్ విధానం ద్వారా జిల్లాలో భారీగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగులకు సైతం భారీ లబ్ధి చేకూరింది.
ఇది వరకు ఉమ్మడి మెదక్ జిల్లా 6వ జోన్లో ఉండేది. 6వ జోన్ పరిధిలోకి హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ జిల్లాలు ఉండేవి. ఎటుచూసినా ఆనాడు జోన్ వైశాల్యం అధికంగా ఉంది. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానం ద్వారా గతంలో ఉన్న జోనల్ వ్యవస్థ పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. కొత్త జోనల్ విధానంలో భాగంగా రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు బహుళ జోన్లు ఏర్పాటు చేశారు. ఇందులో రాజన్న జోన్ పరిధిలోకి సిద్దిపేట, మెదక్ జిల్లాలు ఉన్నాయి. ఈ జోన్ పరిధిలో ఇంకా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి. కొత్త జోన్ విధానంలో జిల్లావాసులకు ఉద్యోగ అవకాశాలు భారీగా పెరిగాయి. జోన్ పరిధిలోని మిగిలిన జిల్లాలతో పోటీపడటం జిల్లా నిరుద్యోగులకు పెద్ద కష్టం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 6వ జోన్ పరిధిలోనే హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ లాంటి జిల్లా వాసులతో పోటీపడిన జిల్లా నిరుద్యోగులకు కొత్త జోనల్ విధానం ఉన్న జిల్లాలో పోటీపడటం మరింత సులభతరం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ రకంగా చూసినా కొత్త జోనల్ విధానం రావడం, దీని ప్రకారం ఉద్యోగాలు భర్తీ అవుతుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట, మెదక్ జిల్లాలు జోన్ -3 రాజన్న పరిధిలోకి, సంగారెడ్డి జిల్లా జోన్ -6 చార్మినార్ పరిధిలోకి వస్తుంది.
నీళ్లు, నిధులు, నియామకాల, నినాదాలు ఫలించాయి. దేశం అబ్బురపడే స్థాయిలో ఉద్యోగ నియామకాల ప్రకటన వచ్చింది. సీఎం కేసీఆర్ కార్యదక్షతకు ఇది నిదర్శనం. ఏడేండ్లలో అనేక నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించి దేశానికే ఆదర్శంగా నిలిచారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించడం హర్షణీయం. మెదక్ జిల్లాలో 1,149 ఉద్యోగాలు భర్తీ అవుతాయి.
-పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు
అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుని వారి కష్టాలను తన కష్టాలుగా భావించే సీఎం కేసీఆర్ నిరుద్యోగుల విషయంలోనూ పెద్ద మనసు చాటుకున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన చేయడం ఎం తో ఆనందంగా ఉంది. ఇప్పటికే వివిధ శాఖల్లో 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన కేసీఆర్ ప్రభుత్వం తాజాగా, భారీగా ఉద్యోగాల భర్తీకి నిర్ణయించడం గొప్ప విషయం. నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
-మహారెడ్డి భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, నారాయణఖేడ్
టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగులకు అండగా ఉంది. ఉద్యోగ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు.ఈ నిర్ణయంతో నిరుద్యోగుల్లో ఫుల్ జోష్ వచ్చింది. నిరుద్యోగులు చక్కగా చదివి, పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందాలి. తెలంగాణ బిడ్డలు గౌరవప్రదమైన పదవులు సాధించాలని ఆశిస్తున్నా.
-గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, పటాన్చెరు
ఖాళీ పోస్ట్‌లను వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించడం హర్షించదగిన విషయం. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామనడం ద్వారా నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుంది. 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా చొరవ చూపడంతో స్థానికులకు ప్రయోజనం కలుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుంది. ఉద్యోగాల వయో పరిమితి పెంచడం యువతకు కలిసొస్తుంది.
-మల్లారెడ్డి, టీఫీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకుడు మెదక్