సిద్దిపేట, మే 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆదిలోనే అభాసుపాలవుతున్నది. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని సంబురంగా పాత ఇంటిని కూలగొట్టుగొని కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తక్కువ కాకుండా, 600 చదరపు అడుగులు విస్తీర్ణం దాటి చేపట్టవద్దని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీచేసింది.
ఇప్పటికే చాలామంది ఇంటి పనులు ప్రారంభించారు. తీరా ఇప్పుడు ప్రభుత్వం కొత్త నిబంధనలు తేవడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు ఇండ్ల సర్వేను మళ్లీ మొదలు పెట్టారు. నిబంధనలు లేని ఇండ్లను రద్దు చేస్తున్నారు. లేదా కట్టిన ఇల్లు ఉంటే ఆ చదరపు అడుగుల్లోపు కుదించుకోవాలని అధికారులు సూచిస్తుండంతో లబ్ధిదారులు ఇల్లు కట్టాలా? వద్దా? అనే మీమాంసలో ఉన్నారు. పాత ఇల్లు పోయింది.. కొత్త ఇల్లు వచ్చే అవకాశం లేకుండా పోయిందని నిరుపేదలు వాపోతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో అయోమయంలో లబ్ధ్దిదారులు
ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలు ప్రకటించక పోవడంతో లబ్ధ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు.తొలుత అందరికీ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలు మార్చింది. ప్రతి మండల కేంద్రంలో ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారికి ప్రొసీడింగ్‌లు ఇచ్చింది. ప్రభుత్వం చెప్పిన మాటలతో ఉన్న ఫలంగా ఇంటిని కూలగొట్టి దాని అడుగులోనే ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసుకున్నారు పేదలు.
కొంతమంది బేస్మెంట్ లెవల్ వరకు పూర్తి చేసుకున్నారు. తీరా ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ప్రతి ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలని ఆదేశించింది. 600 చదరపు అడుగుల పైన ఉన్న ఇంటిని రద్దు చేయాలని సూచించింది. ఇప్పటికే చాలామంది బేస్మెంట్ లెవల్ పూర్తిచేసుకున్నారు. కొందరు గోడల పనులు ప్రారంభించారు. వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా విధించిన నిబంధనలతో చాలామంది ఇండ్లు రద్దయ్యే అవకాశం ఉండడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
కట్టిన వాటికి సైతం బిల్లులు రావడం లేదు. 600 చదరపు అడుగుల విస్తీర్ణం లోపల చేసుకుంటేనే బిల్లులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మాణం చేసుకుంటామని ప్రమాణ పత్రం రాసి ఇవ్వాల్సి వస్తున్నది. ఒకవేళ ఇప్పటికే ఇంటిని 600 చదరపు అడుగుల పైన నిర్మాణం చేసుకున్న వారు కుందించుకుంటామని ఎంపీడీవోకు హామీ పత్రం రాసిస్తే సంబంధిత అధికారుల వచ్చి నిర్మాణాన్ని కుదిస్తూ మార్కింగ్ చేస్తారు. ఇలా ఏవేవో నిబంధనలు పెట్టి తమతో ప్రభుత్వం అడుకుంటున్నదని లబ్ధ్దిదారులు మండిపడుతున్నారు.
ఏ జిల్లాలో ఎన్నెన్ని?
పైలట్ గ్రామం తోటపల్లిలో..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామాన్ని ఇందిరమ్మ ఇండ్ల పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ గ్రామంలో ఇండ్లు లేని 135 మందిని అర్హులుగా గుర్తించారు.తదుపరి ఇందులో 15 మందిని తిరిగి అనర్హులంటూ పేర్కొని 120 మందికి ప్రొసీడింగ్ కాపీలు అధికారులు అందచేశారు. క్షేత్రస్థాయిలో 40 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యా యి. సర్కారు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందన్న ఆశతో కొందరు ఉన్న ఇల్లు కూలగొట్టుకొని నిరాశ్రయులయ్యారు.
ఇందిరమ్మ ఇండ్ల నిబంధనల పేరుతో సర్కారు కొర్రీలు పెడుతుండడంతో మిగతా ఇండ్లు కట్టుకోవడానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. మొదటి దశ ఇండ్లు పూర్తి చేసుకున్న వారికి బిల్లుల చెల్లింపు జరగడం లేదు. మూడు, నాలుగు రోజుల నుంచి అధికారులు ఇండ్ల కొలతలు వేస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 600 చదరపు అడుగులు దాటితే ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల పథకం పరిధిలోకి రావని అధికారులు చెబుతుండడంతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు.
సర్కారు సాయంతో ఇంటి నిర్మాణం పూర్తి కాదు..
కాంగ్రెస్ సర్కారు ఇచ్చే రూ. 5లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కాదు. గ్రామంలో 5 ఇండ్లను నిర్మాణం చేపట్టాను. మొదట ఎలాంటి షరతులు లేకుండా ఇండ్లు కట్టుకోవాలని చెప్పడంతో కొందరు ఇండ్లు కూలగొట్టుకున్నారు. ఇప్పుడు నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత 600 చదరపు అడుగులు దాటిన ఇండ్లను ఇందిరమ్మ పథకంలోకి రావంటూ అధికారులు కొలతలు వేస్తున్నారు. దీంతో గ్రామంలో 15 రోజులుగా ఇండ్ల నిర్మాణం నిలిచిపోయాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకోవడం లబ్ధిదారులకు ఇబ్బందే.
– మాధవ, తాపీమేస్త్రీ
ఇల్లు మొదలు పెట్టిన తర్వాత ఆపేయమన్నారు…
మా అమ్మ శాతవేని ఎలేంద్ర పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ముగ్గు పోసి ఇంటి నిర్మాణం మొదలుపెట్టాము. తీరా అధికారులు వచ్చి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మాణం జరుగుతున్నదని ఆపేయమన్నారు. దీంతో బేస్మెంట్ లెవల్లో నిర్మాణం చేసి వదిలేశాం. కట్టిన వరకు బిల్లు అడిగితే ప్రభుత్వ నియమాల ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే బిల్లులు వస్తాయని చెప్పడంతో ఒక రూమ్ వదిలేసి నిర్మాణం చేపడుతున్నాము. బిల్లుల కోసం ఎదురుచూస్తున్నాం.
– శాతవేని మహేశ్, తోటపల్లి
పాత ఇంటిలో కాలం వెల్లదీస్తున్నాం…
మేము గతంలో కరీంనగర్‌కు బతుకుదెరువు కోసం పోయినం. ఐదారేండ్ల కిందట తోటపల్లికి వచ్చి ఇక్కడే కూలీ, నాలీ చేస్తూ బతుకుతున్నాం. మాకు లేని ఇందిరమ్మ ఇల్లు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. కరీంనగర్లో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని, అందుకే ఇప్పుడు ఇక్కడ మంజూరవడం లేదని పేర్కొంటున్నారు. మాకు అక్కడ ఇల్లు రాలేదు. ఇక్కడ ఇల్లు మంజూరు కావడం లేదు. లేని ఇందిరమ్మ ఇల్లు కోసం మమ్మల్ని ఇట్ల అన్యాయం చేయడం బాధాకరంగా ఉంది. మా ఇల్లు వానకాలంలో ఉరుస్తుండటంతో పాత ఫ్లెక్సీలను కట్టుకొని బతుకుతున్నం. – కొలిపాక ప్రేమలత, తోటపల్లి
పైలట్ ప్రాజెక్టే తప్పుల తడక…
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి తోటపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. లబ్ధిదారుల జాబితా తప్పుల తడకగా ఉంది. 15 మంది అర్హులను అనర్హులుగా చూపిస్తున్నారు. నిజానికి వాళ్లు అర్హులు. గ్రామంలో విచారణ చేస్తే వాస్తవాలు బయటికి వస్తాయి. లబ్ధిదారులకు ఇండ్ల బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల పేరిట లబ్ధిదారులను ఆగం చేస్తున్నారు. నాది కూడా రేకుల షెడ్డు ఇల్లు. ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకుంటే గతంలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని చూపెడుతుందన్నారు. ఏ అధికారికి దరఖాస్తు చేసుకోవాలో… ఎవరికీ విన్నవించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాం. – పోలవేని సంపత్, తోటపల్లి
ఒక్కరికి ఇల్లు మంజూరు కాలేదు..
మాకు తోటపల్లిలో వారసత్వంగా వచ్చిన ఒక్క ఇల్లు ఉంది. కానీ, మేము ముగ్గురం అన్నదమ్ములం. అందరికీ పెండ్లిలు అయి ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నాం. ఇందిరమ్మ ఇంటి కోసం మేం దరఖాస్తు చేసుకుంటే ఎవరికీ ఇల్లు మంజూరు కాలేదు. మేము అన్ని రకాలుగా అర్హులైనప్పటికీ మాకు ఇల్లు మంజూరు కాలేదు. అధికారులను అడిగితే రెండో విడతలో వస్తుందని చెబుతున్నారు. మొదటి దఫాలోనే ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంక రెండో దఫా జాబితా వచ్చుడెప్పుడో.
– ఆవుల రవిచందర్, తోటపల్లి
ఇల్లు కూలగొట్టుకుని రోడ్డున పడ్డం…
ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకుంటే మంజూరైంది. పాత ఇంటిని కూలగొట్టగా అధికారులు వచ్చి ముగ్గు పోశారు. వారం రోజుల తర్వాత ఆన్లైన్లో ఇల్లు మంజూరు కాలేదని పంచాయతీ కార్యదర్శి పనులు ఆపివేయాలని చెప్పాడు. దీంతో ఉన్న ఇల్లు కూలగొట్టుకొని ఆగమయ్యాం. పక్కనే బంధువుల ఇంట్లో కిరాయికి ఉంటున్నం. మాలాగా గ్రామంలో 15 మంది అర్హులు ఉన్నప్పటికీ అనర్హుల కింద చూపిస్తున్నారు.
– గాదాసు బాలు, తోటపల్లి
బిల్లుల కోసం ఎదురుచూస్తున్నాం…
పాత పెంకుటిల్లును కూల్చి ఇందిరమ్మ ఇంటి కోసం ముగ్గు పోసుకున్నాను. సర్కారోళ్లు చెప్పినట్టుగానే 600 చదరపు అడుగులు లోపే ఇల్లు కట్టుకుంటున్నా.బేస్మెంట్ స్థాయిలో నిర్మాణం పూర్తయింది. కానీ, మొదటి దఫా రావాల్సిన బిల్లులు ఇంకా రాలేదు.అధికారులు వచ్చి ఇంటి కొలతలు వేసుకొని వెళ్లారు. 15 రోజులు అవుతున్నా బిల్లులు రావడం లేదు. బిల్లులు రాకుండా నిర్మాణం ఎలా చేయగలుగుతాం.
-పోలు లక్ష్మీ, తోటపల్లి