సిద్దిపేట, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అధికారం కోసం కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక మొండిచెయ్యి చూపింది. సిద్దిపేట జిల్లాలో ఆన్లైన్లో 2,562 దరఖాస్తులు చేసుకోగా 1562 మంజూరు చేశారు. మెదక్ జిల్లాలో 1,262 దరఖాస్తు చేసుకోగా 450, సంగారెడ్డి జిల్లాలో 8,315 దరఖాస్తు చేసుకోగా 435 రేషన్‌కార్డులు మంజూరు చేశారు. ఏదో మంజూరు చేయలేదనకుండా జిల్లాకు కొన్ని మంజూరు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నమ్మి ప్రజాపాలనలో పెద్దఎత్తున ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. తమ పేర్లు రేషన్ కార్డులో యాడ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నా మోక్షం లేదు. ప్రజాపాలన, కుటుంబసమగ్ర సర్వే, మీ సేవల ద్వారా దరఖాస్తులు చేసుకున్నా అర్హులకు రేషన్ కార్డులు రావడం లేదు. పైరవీకార్లు చెప్పిన వారికే రేషన్ కార్డులు మంజూరు చేశారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. తమకు రేషన్‌కార్డు వస్తది అని ఆశపడిన నిరుపేదలకు నిరాశే మిగిలింది. ప్రస్తుతం గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై విచారణ చేస్తున్నారు. ఇందులో ఎంతమందికి రేషన్ కార్డులు వస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
సిద్దిపేట జిల్లాలో రేషన్‌కార్డుల కోసం 2,562 మంది దరఖాస్తు చేసుకోగా 62 తిరస్కరించారు. వీటిలో 1562 మందికి మంజూరు చేశారు. మిగతావి పెండింగ్‌లో ఉన్నాయి. పేర్ల (యాడింగ్) నమోదు కోసం 64,384 దరఖాస్తులు వస్తే ఇప్పటి వరకు 45,269 మాత్రమే చేసి మిగతావి పెండింగ్‌లోనే ఉన్నాయి. మెదక్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం 1262 దరఖాస్తులు వస్తే కేవలం 450 కార్డులు మాత్రమే మంజూరు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 846 రేషన్ షాపులు ఉండగా కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా 8,315 దరఖాస్తులు రాగా 435 కార్డులు మంజూరు చేశారు.
కొత్తగా పేర్లు జత చేయడం కోసం 54,421 దరఖాస్తులు రాగా 52,548 యాడ్ చేశారు. తొలుత ప్రజాపాలన, ఆ తర్వాత సమగ్ర సర్వేలో రేషన్ కార్డులు లేదంటూ దరఖాస్తు చేసుకున్నారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నా నిరాశే మిగిలింది. ఇలా ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి జనవరి 21నుంచి 24 వరకు జరిగిన వార్డు సభల్లో జాబితాను ప్రదర్శించారు. ఈ జాబితాల్లో చాలా మందికి రేషన్ కార్డులు మంజూరు కాలేదు. దీంతో మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ క్రమంలో అర్హులంతా రేషన్‌కార్డుల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. మళ్లీ అధికారులు ప్రకటించిన జాబితాలో సైతం అర్హులకు న్యాయం జరగలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది తప్పా ఆచరణలో శూన్యం. ఇటీవల అరకొరగా రేషన్ కార్డులు మంజూరు చేసి చేతులు దులుపుకుంది.తాము రేషన్ కార్డులు చాలా మంజూరు చేశామని చెబుతుంది. కానీ క్షేత్రస్థాయిలో అర్హులైన చాలామంది రేషన్ కార్డులు రాక ఇబ్బందులు పడుతున్నారు. రేషన్‌కార్డులో పేర్లు యాడ్ చేశామని చెబుతుంది.
దీంట్లో చాలా సమస్యలు వస్తున్నాయని రేషన్ డీలర్లు చెబుతున్నారు.ప్రధానంగా పెండ్లి అయి అత్తగారింటికి వెళ్లిన ఆడపిల్లలకు యాడింగ్ ఆప్షన్లో దరఖాస్తు చేసుకున్నా కావడం లేదు. చాలా రోజుల నుంచి రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు కోసం ఎదురు చూసిన (ఐదారేండ్ల కింద పెండ్లి అయిన) వారు ఇప్పుడు ఇచ్చిన యాడ్ ఆప్షన్ ఆధారంగా అత్తగారింటి వద్ద దరఖాస్తు చేసుకుంటే ఆపేర్లు అమ్మాయి తల్లిగారింటి కార్డుల్లో నమోదయ్యాయి. చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోగా అవి కలెక్టర్ లాగిన్‌లో ఉంటే వాటినే ఇప్పుడు అనుమతి ఇచ్చి తమ ప్రభుత్వం చేసింది అని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు.
సిద్దిపేట జిల్లాలో మొత్తం రేషన్ దుకాణాలు 688 ఉన్నాయి. వీటి ద్వారా జిల్లాలోని 2,91,327 మంది రేషన్ కార్డుదారులకు ప్రతినెలా 5,775 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా జరుగుతంది. ఈ జిల్లాలో 18,336 అంత్యోదయ, 2,72,909 ఆహార భద్రత, 82 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. మెదక్ జిల్లాలో 520 రేషన్ దుకాణాలు ఉండగా వీటి ద్వారా 4,430. 496 మెట్రిక్ టన్నుల బియ్యం అందిస్తున్నారు. వీటిలో 13,860 అంత్యోదయ, 1,99,902 ఆహార భద్రత, 66 అన్నపూర్ణ, మొత్తం 2,13,828 కార్డులు ఉన్నా యి. సంగారెడ్డి జిల్లాలో 26,115 అంత్యోదయ, 3,52,513 ఆహార భద్రత, 100 అన్నపూర్ణ, మొత్తం 3,78,728 కార్డులు ఉన్నాయి. జిల్లాలో ప్రతినెలా 7,998.781 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజలకు అందిస్తున్నారు.