హుస్నాబాద్, జనవరి 10: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ విషయంలో ఇదుగో వచ్చే…అదిగో వచ్చే అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేయడంతో లబ్ధ్దిదారులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేషన్‌కార్డులు లబ్ధ్దిదారులకు అందని ద్రాక్షలా మారాయని చెప్పవచ్చు. ప్రజా పాలన దరఖాస్తులు తీసుకొని ఏడాది గడిచింది. అయినా కొత్త రేషన్‌కార్డుల జారీ గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధ్దిదారులకు నిరాశే మిగులుతోంది.
ప్రజాపాలన దరఖాస్తులకు ముందు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు చాలామంది ఉన్నారు. చాలా ఏండ్లుగా కొత్త రేషన్‌కార్డులు రాకపోవడంతో దరఖాస్తుదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల హుస్నాబాద్‌లో ప్రకటించారు.సమయం సమీపిస్తున్నా ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు, సర్వేలు కానీ ఇప్పటి వరకు మొదలు కాకపోవడంతో రేషన్‌కార్డుల పంపిణీపై నీలినీడలు అలుముకుంటున్నాయి.
కేవలం ప్రకటనలతో మభ్యపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హుస్నాబాద్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రస్తుతం 13,205 మంది రేషన్‌కార్డు లబ్ధ్దిదారులు ఉన్నారు. ఇందులో 747 అంత్యోదయ కార్డులు ఉండగా, 12,458 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయి. హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 405 అంత్యోదయ కార్డులు, 5,336 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయి. మండలంలోని గ్రామాల్లో 342అంత్యోదయ కార్డులు, 6,375ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇంకా కొనసాగుతున్నాయి.
హుస్నాబాద్ మున్సిపాలిటీ, మండలంలో కొత్తగా రేషన్‌కార్డుల కోసం సుమారు 3నుంచి 4వేల మంది దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. కొన్నేండ్ల వివాహమైన వారు, కుటుంబం నుంచి వేరుపడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. హుస్నాబాద్ పట్టణంలోనే సుమారు 2 వేల మంది రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, సర్కారు విధివిధానాలు, కొత్త రేషన్‌కార్డుల జారీపై స్పష్టమైన ప్రకటన జారీ చేయక పోవడంతో వీరంతా అయోమయానికి గురవుతున్నారు. జనవరి 26నుంచి ఇస్తారని కొందరు, మార్చి తరువాతనే ఇస్తారని మరికొందరు మంత్రులు ప్రకటనలు ఇస్తుండడం, రేషన్‌కార్డుల జారీ ప్రక్రియకు కనీసం అంకురార్పణ చేయకపోవడంతో చాలామంది నిరాశకు గురవుతున్నారు.
ప్రస్తుతం ఉన్న రేషన్ లబ్ధ్దిదారుల సంఖ్యకు అనుగుణంగా రేషన్ దుకాణాల సంఖ్య పెరగలేదు. దీంతో ఒకే దుకాణంలో వందల సంఖ్యలో లబ్ధిదారులు ఉండడంతో రేషన్ పంపిణీ ప్రహసనంగా మారింది. హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో అంత్యోదయ, రేషన్‌కార్డులు కలిపి మొత్తం 5,741మంది లబ్ధ్దిదారులు ఉంటే, కేవలం 8 రేషన్ దుకాణాలు మాత్రమే ఉన్నాయి. పట్టణంలోని 3811004 నంబర్ రేషన్ దుకాణంలో ఏకంగా 1,290 మంది లబ్ధ్దిదారులు ఉన్నారు.
ప్రతి దుకాణంలో 500ల నుంచి 900ల మంది లబ్ధిదారులు ఉండడంతో గంటల తరబడి రేషన్ కోసం వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడ ఉన్న 20వార్డుల్లో వార్డుకో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని 17గ్రామ పంచాయతీల్లో 16దుకాణాలు ఉన్నాయి. పొట్లపల్లి, పందిల్ల, మీర్జాపూర్ గ్రామాల్లో రెండు చొప్పున ఉండగా, మిగతా గ్రామాల్లో ఒక్కోటి మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రేషన్ దుకాణాను రెట్టింపు చేస్తేనే లబ్ధ్దిదారులకు సౌకర్యంగా ఉంటుంది.
కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కోసం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే హుస్నాబాద్ మున్సిపాలిటీతో పా టు మండలంలోని అన్ని గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరిస్తాం. ఆ తర్వాత అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలవుతుంది. రేషన్‌కా ర్డు కోసం గతంలో 250 దరఖాస్తులు వచ్చాయి. కొత్త రేషన్‌కార్డుల పంపిణీ లేనందున ఇవి పెండింగ్‌లో ఉ న్నాయి. ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు, ఎప్పటి నుంచి రేషన్‌కార్డులు ఇస్తారనే విషయంపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు లేవు. రేషన్‌కార్డుల కోసం చాలా మంది వేచిచూస్తున్న మాట వాస్తవం. రేషన్ దుకాణాల సంఖ్య పెంపుపై ప్రభుత్వానికి నివేదిస్తాం.
-రవీందర్‌రెడ్డి, హుస్నాబాద్ తహసీల్దార్