సీఎం కేసీఆర్ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గం కొత్త రూపును సంతరించుకున్నది. ఉమ్మడిరాష్ట్రంలో దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం తొమ్మిదేండ్లలో ఊహించని ప్రగతి సాధించి ఆదర్శంగా నిలుస్తున్నది. రూ. వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతుండడంతో అన్ని వర్గాల ప్రజలకు వసతులు సమకూరుతున్నాయి. ప్రధానంగా 1.31 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రూ.1,774 కోట్లతో ప్రభుత్వం బసవేశ్వర ఎత్తిపోతలు నిర్మిస్తున్నది. మిషన్ భగీరథ ద్వారా 182 పంచాయతీల్లోని 372 ఆవాస ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నది. రూ.82 కోట్లు మంజూరు చేసి 210 తండాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించింది. రూ.95.50 కోట్లతో బీటీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఏరియా దవాఖానను 30 నుంచి 100 పడకలకు, కల్హేర్, కరస్‌గుత్తి పీహెచ్‌సీలకు కొత్త భవనాలు నిర్మించి 30 పడకలకు అప్‌గ్రేడ్ చేయడంతో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. గ్రామీణ విద్యార్థులకు విద్యనందించేందుకు ఎనిమిది గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి, రూ. 16.80 కోట్లతో నాలుగు ఎస్టీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించి అన్ని వసతులు కల్పించింది. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు మంజూరు చేయడంతో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి.
– నారాయణఖేడ్, మార్చి 25
Medak4
నారాయణఖేడ్, మార్చి 25: ఒకప్పుడు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అంటే వెనుకబాటు.. వలసలు.. పనిష్మెంట్.. వివక్ష. కానీ, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ పాలనలో ఈ తొమ్మిదేండ్లలో ఊహించని అభివృద్ధి జరిగింది. సమైక్య రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజకవర్గంపై వెనుకబాటు ముద్ర వేయడంతో పాటు శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఉద్యోగులను కంగ్టి, మనూరు మండలాలకు బదిలీ చేసి ఈ ప్రాంతాన్ని పనిష్మెంట్ జోన్‌గా మార్చేశారు. తత్ఫలితంగా విధుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సహజంగానే ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది. అయితే, తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత ఇక్కడి పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. గడిచిన తొమ్మిదేండ్లలో అన్ని రంగాలు పురోగతి వైపు పరుగులు పెడుతుండగా, దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పట్టి పీడించిన తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కారమయ్యాయి.
తలమానికంగా గురుకులాలు
నియోజకవర్గంలో ఏకంగా ఎనిమిది గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయగా, నాలుగు ఎస్టీ, రెండు మైనార్టీ, రెండు బీసీ గురుకులాలు ఉన్నాయి. నారాయణఖేడ్, కంగ్టి, సిర్గాపూర్, కరస్గుత్తిలలో ఎస్టీ గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలను నిర్మించగా, ఒక్కో భవనానికి రూ.4.20 కోట్ల చొప్పున మొత్తం 16.80 కోట్లు వెచ్చించారు. సాంఘిక సంక్షేమ గురుకుల భవనం శిథిలావస్థకు చేరగా రూ.13 కోట్లతో అన్ని హంగులతో నిర్మించిన నూతన భవనం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. మనూరులో కొత్తగా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటు కంగ్టి, కల్హేర్ జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు, ఫర్నిచర్ తదితర సదుపాయాలు కల్పించి విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది.
సాగునీటి కోసం అడుగులు
సాగునీటి వనరులు అంతగా లేని నారాయణఖేడ్ నియోజకవర్గంలో రైతులు అత్యధికంగా వర్షాధార పంటలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. సారవంతమైన భూములు ఉన్నప్పటికీ భూగర్భజలాల కొరత రైతులకు శాపంగా పరిణమిస్తుందనే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కల్పన వైపు దృష్టి సారించింది. ఫలితంగా బసవేశ్వర ఎత్తిపోతలకు రూపకల్పన చేసింది. ఈ నేపథ్యంలో రూ.1,774 కోట్లతో ఎత్తిపోతలను నిర్మించి నియోజకవర్గంలోని 1.31 లక్షల ఎకరాలకు సాగునీరందించే దిశగా చర్యలు ఊపందుకున్నాయి. సీఎం కేసీఆర్ ఎత్తిపోతలకు శంకుస్థాపన చేయగా, ఇటీవల మంత్రి హరీశ్‌రావు మనూరు మండలం బోరంచలో పనులు ప్రారంభించారు. ఇప్పటికే 51 మంది భూ నిర్వాసితులకు స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి పరిహారం మొత్తం అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలించి, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన ఎత్తిపోతల పథకం సాగునీటి కోసం తరతరాలుగా పరితపించిన ఇక్కడి రైతాంగానికి వరప్రదాయినిగా పరిణమించనుంది. ఇదీకాక నారాయణఖేడ్, నాగల్గిద్ద, మనూరు, కంగ్టి మండలాల్లో కొత్తగా ఎనిమిది చెరువుల నిర్మాణానికి రూ.69 కోట్లు, రూ.25.75 కోట్లతో నల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ, రూ.7.19 కోట్ల వ్యయంతో నాలుగు ఎత్తిపోతల పునరుద్ధరణ వంటి చర్యలు నీటిపారుదల, వ్యవసాయరంగాలకు ఊతమిస్తున్నాయి.
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
గతంలో నిత్యం తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడిన నారాయణఖేడ్ నియోజకవర్గానికి మిషన్ భగీరథ రూపంలో శాశ్వత పరిష్కారం లభించింది. తండాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రభుత్వం రూ. 408 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టి ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నది. 182 పంచాయతీల్లోని 372 ఆవాస ప్రాంతాలకు అధికారులు నీరు సరఫరా చేస్తున్నారు. మంజీరా పరీవాహక ప్రాంతమైన రేగోడ్ మండలం తాటిపల్లి వద్ద 350 కిలోలీటర్ల భారీ ట్యాంకు నిర్మించి 530 కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా ఆవాస ప్రాంతాలకు నీటిని అందిస్తున్నారు.
తండాలకు రాచమార్గాలు
సమైక్యరాష్ట్రంలో గతుకులమయంగా ఉన్న రహదారులన్నీ తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాచమార్గాలుగా మారాయి. నియోజకవర్గంలో సుమారు 210 తండాలు ఉండగా, ప్రభుత్వం రూ.82 కోట్లు నిధులు మంజూరు చేసి 90శాతం తండాలకు రవాణా సౌకర్యం మెరుగుపరిచింది. రూ.57 కోట్లతో నారాయణఖేడ్- దెగుల్‌వాడి డబుల్ రోడ్డు, రూ.22 కోట్లతో నారాయణఖేడ్- కరస్‌గుత్తి డబుల్ లేన్, రూ.10 కోట్లతో నారాయణఖేడ్-రాయిపల్లి డబుల్ లేన్, రూ.18 కోట్లతో నిజాంపేట్ నుంచి మునిగేపల్లి, నాగదర్ మీదుగా మార్డి క్రాస్‌రోడ్డు వరకు రోడ్డు ఏర్పాటు చేయగా, నారాయణఖేడ్ నుంచి సిర్గాపూర్ మీదుగా మాసాన్‌పల్లి వరకు డబుల్ లేన్‌కు రూ.15 కోట్లు మంజూరయ్యాయి. నియోజకవర్గంలోని బీటీ రోడ్ల అభివృద్ధికి తొమ్మిదేండ్లలో రూ.95.5 కోట్లు కేటాయించగా, రూ.38 కోట్లతో అవసరమైన చోట్ల హై లెవెల్ బ్రిడ్జీలు నిర్మించారు.
Medak3
సర్కార్ దవాఖానలో మెరుగైన వైద్యం
నారాయణఖేడ్‌లో 30 పడకలకు ఏరియా దవాఖానను ప్రభుత్వం వంద పడకలకు విస్తరించడంతో పాటు రూ.17 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. సుఖ ప్రసవాలు చేయడంతో పాటు నవజాత శిశువుల కోసం నియోజకవర్గం కేంద్రంలో రూ.11 కోట్లతో నిర్మిస్తున్న మాతాశిశు దవాఖాన ప్రస్తుతం తుది దశలో ఉంది. మండల కేంద్రాలైన కల్హేర్, కరస్‌గుత్తి పీహెచ్‌సీలను 30 పడకలకు అప్‌గ్రేడ్ చేయడంతో పాటు రూ.12.80 కోట్లతో నూతన భవనాలను నిర్మించారు. నిజాంపేట్, సిర్గాపూర్ పీహెచ్‌సీలకు నూతన భవనాల కోసం ప్రభుత్వం రూ.3.12 కోట్లు మంజూరు చేయగా, టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నారాయణఖేడ్ ఏరియా దవాఖానలో డయాలసిస్ సెంటర్, రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలు అందిస్తుండగా, రూ. కోటి నిధులతో ఆక్సిజన్ ప్లాంట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఉచితంగా 56 రకాల పరీక్షలు చేసేందుకు వీలుగా త్వరలో రూ.2 కోట్లతో టీ డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ప్రజావసరాలే ప్రాతిపదికగా..
రైతులు తాము పండించిన పంటలను అమ్ముకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి అవస్థలు పడేవారు. అన్నదాతల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లతో నారాయణఖేడ్‌లో మార్కెట్‌యార్డు, పెద్దశంకరంపేటలో సబ్మార్కెట్యార్డు నిర్మించడంతో పాటు కంగ్టి, కల్హేర్, మనూరులలో గోదాంలను నిర్మించింది. నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.24 కోట్ల వ్యయంతో 15 కొత్త సబ్స్టేషన్లను ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీగా ఏర్పాటైన నారాయణఖేడ్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసే దిశగా తొలి విడుతలో ప్రభుత్వ రూ.15 కోట్లు మంజూరు చేసి అవసరమైన పనులు పూర్తి చేసింది.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మరో రూ.25 కోట్ల పనులు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రకారం నారాయణఖేడ్ మున్సిపాలిటీకి రూ.50 కోట్ల రోడ్డు భద్రతా నిధులు మంజూరవగా, టెండర్ దశ కొనసాగుతున్నది. ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు చేసి పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. 1150 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తుండగా, ఇప్పటికే 250 ఇండ్ల పంపిణీని పూర్తయింది. మిగతా ఇండ్లను త్వరలో పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, హరితహారం, క్రీడాప్రాంగణాలతో గ్రామాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కోసం నారాయణఖేడ్ మండలాన్ని ఎంపిక చేసి రూ.30 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు.
Medak1
ప్రజల దరికి పాలన
పారదర్శక పరిపాలనను అందించి, ప్రజల సమస్యలు వేగవంతంగా పరిష్కరించే దిశగా బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయి. ముఖ్యంగా మేజర్ పంచాయతీగా ఉన్న నారాయణఖేడ్‌ను మున్సిపాలిటీగా మారింది. గతంలో నారాయణఖేడ్ సర్కిల్ మెదక్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఉండగా, ప్రస్తుతం నారాయణఖేడ్‌లోనే డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేశారు. సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధి నుంచి నారాయణఖేడ్‌లోనే రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికింది సర్కార్. ప్రజల ఆకాంక్షలను గౌరవించే విషయంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందనడానికి మూడు కొత్త మండలాలను ఏర్పాటు చేయడమే నిదర్శనంగా చెప్పవచ్చు. నియోజకవర్గంలో నారాయణఖేడ్, కంగ్టి, మనూరు, కల్హేర్, పెద్దశంకరంపేట మండలాలు ఉండగా సిర్గాపూర్, నాగల్గిద్ద, నిజాంపేట్ కేంద్రాలుగా మరో మూడు మండలాలను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత చేరువైంది. నియోజకవర్గంలో మొత్తం 54 తండాలను పంచాయతీలుగా ప్రకటించి ఓ వైపు తండాల అభివృద్ధి, మరోవైపు గిరిజనులే తండాలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించి వారికి సముచిత గౌరవమిచ్చింది ప్రభుత్వం.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే అభివృద్ధి
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా వెనుకబాటుకు గురి చేశారు. అన్నిప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నారాయణఖేడ్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటున్నందునే తొమ్మిదేండ్లలో ఊహించని అభివృద్ధి జరిగింది. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీశ్‌రావు సహకారంతోనే నియోజకవర్గంలో కోట్లాది రూపాయాలు పనులు జరుగుతున్నాయి. స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తున్నాను. ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.
– మహారెడ్డి భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, నారాయణఖేడ్