సంగారెడ్డి/ మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 23: తెలంగాణ ప్రభుత్వం మెరుగైన విద్యావ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందించేందుకు నూతన గురుకుల విద్యాలయాలను మంజూరు చేసింది. ఇందులో భాగంగానే మెదక్ జిల్లాకు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల, బీసీ డిగ్రీ కళాశాలల, సంగారెడ్డి జిల్లాకు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవుల అనంతరం ఆయా విద్యాలయాలు ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే నెలలో ప్రారంభానికి చర్యలు..
కొత్తగా బాలికల గురుకుల పాఠశాల, బాలుర డిగ్రీ కళాశాల వచ్చే నెలలో ప్రారంభించడాని చర్యలు తీసుకుంటున్నాం. బాలికల గురుకుల పాఠశాల అక్టోబర్ 10న, డిగ్రీ కళాశాల అక్టోబర్ 15న ప్రారంభించాలని ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి. నూతనంగా ఏర్పడే బాలికల గురుకుల పాఠశాలలో 5, 6, 7వ తరగతులకు ప్రవేశాలను కల్పించనున్నారు. ఒక్కో తరగతికి రెండు సెక్షన్లలో 80మంది బాలికల చొప్పున 240మంది బాలికలకు ప్రవేశాలు కల్పించనున్నాం. ఇదివరకు ప్రవేశ పరీక్ష రాసి సీట్లు రాని వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యత ఇస్తాం.
– ప్రభాకర్, ఉమ్మడి జిల్లా గురుకులాల ఆర్సీవో
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు..
మెదక్‌కు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల, బాలుర డిగ్రీ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పటికే మెదక్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు మహిళా గురుకుల డిగ్రీ కళాశాలు ఉన్నాయి. మరో కళాశాల ఏర్పడనుండటంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే
పేదలకు ఉన్నతస్థాయి విద్య
తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థను మెరుగుపరుస్తున్నది. పేద విద్యార్థులకు ఉన్నతస్థాయి విద్యనందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణ బద్ధులుగా పనిచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మరో మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలను మంజూరు చేయడం సంతోషకరం. ఇప్పటికే ‘మనఊరు-మనబడి’ ప్రారంభించి వసతులు కల్పిస్తుండగా, మరో విద్యాలయాన్ని అందించడం జిల్లా ప్రజల అదృష్టం. గురుకుల పాఠశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– చింతా ప్రభాకర్, హాండ్లూమ్ అభివృద్ధి సంస్థ చైర్మన్
విద్యావ్యవస్థను పటిష్టం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే..
విద్యావ్యవస్థలో కీలక మార్పులు తీసుకువస్తూ, ప్రభుత్వ విద్యను పటిష్టం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాల మెరుగైన ఫలితాలు సాధిస్తూ ప్రథమ స్థానంలో నిలుస్తున్నది. మరో గురుకుల పాఠశాలను మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం. విద్యా కుసుమాలు వికంచేందుకు విద్యార్థులు మరో అణిముత్యమైన గురుకుల పాఠశాలతో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలి.
– బీరయ్య యాదవ్, బీసీ సంఘం జాతీయ కార్యదర్శి