హుస్నాబాద్, జనవరి 26: రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నాడని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. హుస్నాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన పొన్నం హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నియమించబడ్డాడన్నారు. ఆయన హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ జిల్లాలో పెత్తనాన్ని చెలాయించాలి తప్పా ఇతర జిల్లాల్లో కూడా ఆయన లేకుండా అభివృద్ధి పనులు చేయొద్దని ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో తాను లేకుండా అభివృద్ధి పనులు ప్రారంభించొద్దని, శంకుస్థాపనలు చేయొద్దని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించడం ఆయన నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు.
మంత్రి తీరు వల్ల ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు విలువలేకుండా పోతోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గంలలో మంత్రి అజమాయిషీ ఎక్కువైందని విమర్శించారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులను హరించేలా వ్యవహరించడం మంత్రికి తగదన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కొత్త గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం పూర్తయిందని, వీటిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఈ నెల 30వ తేదీలోపు జీపీ భవనాలు ప్రారంభించాలని, లేకుంటే సర్పంచ్‌లే ప్రారంభించుకుంటారన్నారు. సమావేశంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్ చైర్ పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎంపీపీలు లకావత్ మానస, మాలోతు లక్ష్మీ, జడ్పీటీసీ భూక్యా మంగ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, నాయకులు సుద్దాల చంద్రయ్య, తిరుపతిరెడ్డి, ఆకుల వెంకట్, అశోక్‌బాబు, బండి పుష్ప, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.