సిద్దిపేట, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి రెండు నెలల ముందే మద్యం దుకాణా(వైన్స్)లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నది. గత టెండర్‌కు సంబంధించి లైసెన్స్‌ల గడువు ఇంకా ముగియక ముందే కొత్త నోటిఫికేషన్ జారీచేసింది. గతంలో టెండర్ దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా, ఈసారి దానిని రూ.3 లక్షలకు పెంచింది. ఈ ఫీజు తిరిగి చెల్లించరు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2025-27 రెండేండ్ల కాలానికి శుక్రవారం నుంచి అధికారులు వైన్స్‌లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
మద్యం షాప్‌ల రిజర్వేషన్ డ్రా ద్వారా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఖరారు చేశారు. మద్యం షాపుల్లో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. అన్ని జిల్లాల్లో టెండర్లకు నోటిఫికేషన్ జారీచేశారు. అక్టోబర్ 18వ తేదీ వరకు వైన్స్‌లకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 23న లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తారు. షాప్‌లు దక్కించుకున్న వారు డిసెంబర్ 1 తెరవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను నింపుకొనే పడింది. ఇందులో భాగంగా దరఖాస్తులకు అధికంగా ఫీజు వసూలు చేస్తోందని వ్యాపారులు ఆరోపిస్తున్నాయి.మద్యం దుకాణాలకు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా టెండర్ వేసుకోవచ్చ. ఒక్కో వ్యక్తి ఎన్ని దరఖాస్తులు అయినా సమర్పించవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గతంలో 243 వైన్స్‌లకు 12,227 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తుల ద్వారానే రూ. 244.54 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో కొత్తగా వైన్స్‌లు దక్కించుకున్న వారి పంట పండే అవకాశం ఉంది. అందువల్ల ఈసారి వైన్స్‌లకు దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలడంతో చాలామంది వైన్స్ వ్యాపారంలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. తద్వారా భారీగా దరఖాస్తుల చేయడంతో ప్రభుత్వానికి ఆదాయం మరింతగా పెరిగే అవకాశం
ఉంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 243 మద్యం దుకాణాలకు అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీటిలో 34 గౌడ, 28 ఎస్సీ, 03 ఎస్టీ, 178 ఇతరులకు వైన్స్‌లు కేటాయించారు. జిల్లాలోని ఎక్సైజ్ కార్యాలయాల్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయం త్రం 5 వరకు ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తులు స్వీకరిస్తారు. 5 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న దుకాణాలకు రూ. 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉంటే రూ. 60 లక్షలు, లక్ష నుంచి ఐదు లక్షల జనాభా వరకు ఉంటే రూ. 65 లక్షల ఫీజు నిర్ణయించారు.
సిద్దిపేట జిల్లాలో మొత్తం 93 వైన్స్‌లకు 16 గౌడ కులస్తులకు కేటాయించారు. 9 ఎస్సీలకు కేటాయించారు. 68 ఇతర సామాజిక వర్గానికి కేటాయించారు. గతేడాది 93 వైన్స్‌లకు 4166 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ. 83.32 కోట్ల ఆదాయం వచ్చింది.
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 101 వైన్స్‌లు ఉన్నాయి. వీటిలో ఎస్సీలకు 13, ఎస్టీలకు 02, గౌడలకు 9, మిగతా వారికి 77 వైన్స్‌లు కేటాయించారు. గతంలో సంగారెడ్డి జిల్లాలోని 101 వైన్స్‌లకు 6156 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.123.12 కోట్ల ఆదాయం వచ్చింది.
మెదక్ జిల్లాలో మొత్తం 49 వైన్స్‌లకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. వీటిలో ఎస్సీలకు 06, ఎస్టీలకు 01, గౌడ సామాజిక వర్గానికి 9, ఇతరులకు 33 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా అధికారులు కేటాయించారు. గతంలో 49 వైన్స్‌లకు 1905 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ. 38.10 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.