దుబ్బాక, మే 20: ధాన్యం కొనుగోళ్లపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. మద్దతు ధర కోసం మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన రైతులు పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క అకాల వర్షాలు, మరో పక్క అధికారులు నిర్లక్ష్యంతో అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రోజులు తరబడి ఆరబెడుతూ అవస్థలు పడుతున్నారు. మరికొన్ని చోట్ల లారీలు రాకపోవడంతో కొనుగోలు చేపట్టడం లేదు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 106 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. చాలా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఆలస్యంగా ప్రారంభించడంతో రైతులు తక్కువ ధరకే రైసు మిల్లర్లకు, దళారులకు ధాన్యం విక్రయించారు. తూకంలో బస్తాకు 2 కిలోల చొప్పున తీస్తూ రైతులను ఆర్థికంగా ముంచుతున్నారు.
20 రోజుల కిందట కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చాం. ఇప్పటికీ మా ధాన్యం కొనడం లేదు. మాకంటే ముందుగా వచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు. మా గ్రామానికి లారీలు పంపకపోవడంతో ధాన్యం కొనడం లేదు. మా రాజక్కపేట గ్రామంలో మూడుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజుకు ఒక్క లారీ చొప్పున పంపిస్తున్నారు. రోజూ ధాన్యం ఆరబెడుతూ.. కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నాం. వారం రోజుల కిందట వర్షానికి వడ్లు తడిసిపోయాయి. వడ్లు ఆరబెట్టిన కొనుగోలు చేయడం లేదు.
ఐదు ఎకరాల్లో సుమారు 120 క్వింటాళ్ల ధాన్యం పండింది. 20 రోజుల కిందట దుబ్బాక మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకొచ్చాం. యార్డులో వడ్లు సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో సమస్య నెలకొంది. వారం రోజుల కిందట కురిసిన వానకు ధాన్యం(వడ్లు) పూర్తిగా తడిసిపోగా, కొనుగోలు చేయడం లేదు. రోజూ వడ్లను ఆరబెడుతూ ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పుడు కొనుగోలు చేస్తారో చెప్పడం లేదు. మద్దతు ధర ఏమో కానీ, పండిన పంట(వడ్ల) కుప్ప వద్ద పడికాపులు కాస్తున్నాం. ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.