మెదక్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ) : మెదక్ జిల్లాలో జాతీయ పార్టీలు కాంగ్రెస్,బీజేపీ, బీఎస్పీ కుమ్మక్కు రాజకీయాలకు తెరదీశాయి. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు బీఆర్ఎస్కు దక్కకుండా ఈ పార్టీలు దిగజారాయి. మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో మూడు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ ఒక్కటి కావడం చర్చనీయాంశంగా మారింది. జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేసుకోవడం, సైద్ధాంతికంగా వేరు.
కానీ, మెదక్‌లో మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం కలిసిపోవడంపై ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలుపొంది పెద్ద పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్కు చైర్మన్ పదవి రాకుండా అడ్డుకున్నాయి. తూప్రాన్‌లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన బొంది రజిని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్‌పర్సన్‌గా కొక్కండ సమతను ఎనుకున్నారు. రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గజవాడ లావణ్య చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్మన్‌గా పోచమ్మ వవనీతను ఎన్నిక చేశారు.
మెదక్‌లో ఒక్కటైన మూడు జాతీయ పార్టీలు
మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు 15 మంది కౌన్సిలర్లుగా గెలిచారు. కాంగ్రెస్ నుంచి 14 మంది, బీజేపీ 2, బీఎస్పీ నుంచి ఒక కౌన్సిలర్ గెలిచారు. మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11.30 గంటలకు కొత్తగా ఉన్నికైన కౌన్సిలర్లతో జడ్పీ సీఈవో, ఎన్నికల అధికారి ఎల్లయ్య ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం తర్వాత కౌన్సిలర్లతో చైర్పర్సన్ ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటించారు. చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించేందుకు 32 మంది వార్డు సభ్యులతో పాటు ఎక్స్అఫీషియో సభ్యుడు మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు సమావేశంలో ఉండడంతో కోరం ఉందని ప్రకటించి ఎన్నిక అధికారి చైర్పర్సన్ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
చైర్పర్సన్ ఎన్నిక కోసం సభ్యులు మద్దతు తెలిపేందుకు సిద్ధ్దం కాగా, సభ నుంచి బీజేపీకి చెందిన ఇద్దరు వార్డు సభ్యులు బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ చైర్ పర్సన్ ఎన్నిక కోసం 14 మంది వార్డు సభ్యులతో పాటు బీఎస్సీ, ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే ఓటు వేయడంతో మెజార్టీ 16కు చేరింది. బీఆర్ఎస్ తరపున చైర్పర్సన్ కోసం పోటీ చేసి ఓటింగ్ నిర్వహించగా 15 ఓట్లు వచ్చా యి. దీంతో మెజార్టీ కాంగ్రెస్‌కు ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాధికను చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. వైస్ చైర్మన్‌గా నరేశ్‌గౌడ్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
నర్సాపూర్‌లో చైర్మన్‌గా కాంగ్రెస్,వైస్ చైర్మన్‌గా బీజేపీ
నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవి బీఆర్ఎస్కు దక్కకుండా రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయి. కాంగ్రెస్ కౌన్సిలర్ మాచినూరి లక్ష్మికి చైర్పర్సన్, బీజేపీ కౌన్సిలర్ బుచ్చిష్ యాదవ్‌ను వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు బీజేపీ కౌన్సిలర్లు నలుగురు, కాంగ్రెస్ ఏదో వార్డు కౌన్సిలర్ మాచునూరి లక్ష్మీకి మద్దతు తెలపడంతో చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ 13వ వార్డు కౌన్సిలర్ బుచ్చేశ్యాదవ్కు కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు మద్దతు తెలపగా వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.