పటాన్చెరు టౌన్, మే 10: క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నా రు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని భారతరత్న పీవీ నరసింహరావు ఆడిటోరియంలో ఆదివారం లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గూడెం విష్ణువర్ధన్‌రెడ్డి స్మారక 10వ జాతీయ స్థాయి కరాటే ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్లుగా జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 2000 మంది క్రీడాకారులు హాజరు కావడం పటాన్చెరు నియోజకవర్గం ఖ్యాతి మరింత పెరిగిందన్నారు.దశాబ్దాల చరిత్ర కలిగిన పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానాన్ని ఆధునీకరించడంతో పాటు ఏడాది పొడవునా జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడాకారుల కోసం నియోజకవర్గ వ్యాప్తంగా మూడు మినీ స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ప్రస్తుత సమాజంలో మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరంగా మారాయని, సమాజం నుంచి వాటిని తరిమికొట్టడంలో ప్రతిఒక్కరూ ముందుకురావాలని కోరారు. చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకొని విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. కరాటే పోటీల నిర్వహణ కోసం ఎమ్మెల్యే రూ.5 లక్షలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, అంజయ్యయాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, నాయకులు దశరథ్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంత్‌రెడ్డి, వెంకటేశ్, చంద్రశేఖర్, షకీల్, టోర్నమెంట్ నిర్వాహకులు రాజుయాదవ్, వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన క్రీడాకారులు, తల్లిదండ్రులు, అకాడమీ నిర్వాహకులు పాల్గొన్నారు.