కంది, సెప్టెంబర్ 5: సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) 2025 పదో ఎడిషన్ ర్యాంకింగ్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్‌లో ఐఐటీహెచ్ ఇంజినీరింగ్ విభాగం ఏడో స్థానం సాధించింది. గత సంవత్సరం ర్యాంకింగ్‌లో 8వ స్థానంలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ ఈ ఏడాది ర్యాంకింగ్‌లో ఏడో స్థానం సాధించి టాప్-10లో నిలిచింది.
ఇన్నోవేషన్ విభాగంలో 6వ ర్యాంక్, ఓవరాల్ విభాగంలో 12వ ర్యాంక్, రీసెర్చ్‌లో 15వ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ ఐఐటీహెచ్‌కు మెరుగైన ర్యాంకింగ్ దక్కడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్‌లో ఏడో ర్యాంక్ సాధించడమనేది కేవలం మా కృషికి గుర్తింపు మాత్రమే కాకుండా, మా విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ కార్యక్రమాలను విస్తరించడానికి ప్రేరణ అన్నారు. ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు అశోక్‌కుమార్ పాండే, డాక్టర్ సౌరబ్ సండిల్యా పాల్గొన్నారు.