చిలిపిచెడ్, మే 17: భూభారతి చట్టాన్ని దుర్వినియోగం చేసే అధికారులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని, గిరిజన రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా చిలిపిచెడ్లోని రైతువేదికలో భూభారతి చట్టం ముగింపు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ రఘునంద్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు.
అనంతరం మంత్రి పొంగుటేటి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 18 రాష్ర్టాల్లో రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిలో నుంచి కొన్ని ముఖ్యమైన అంశాలతో కలిపి భూభారతి చట్టం తెచ్చి పోర్టల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో, అదేవిధంగా భూములకు భూదాన్ను ఈ చట్టంలో పేర్కొన్నట్లు తెలిపారు. 2025 చట్టానికి ముందే 10956 వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థ ఉండేదని, ఆనాటి ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఆ వ్యవస్థను రద్దు చేశారన్నారు. చిలిపిచెడ్ మండలంలోని 16 రెవెన్యూ గ్రామాల్లో భూ సమస్యలపై వేయి దరఖాస్తులు వచ్చాయని, భూభారతి కోసం నాలుగు పైలట్ మండలాలు ఎంపిక చేశామన్నారు.
సాదాబైనామా కాకుండా మిగతా అంశాలు అన్నింటినీ నాలుగు మండలాల్లో జూన్ 2 తేదీ వరకు పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 32 మండలాల్లో భూ భారతి చట్టం తీసుకువచ్చామని, దీని ద్వారా వచ్చిన ఫలితాలను ఆలోచించి జూన్ 2 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. ఆగస్టు 15నాటికి ఎక్కువ సమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యం అన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నెలాఖరులోపు అర్హులకు ఇవ్వాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు.
ధరణితో 80శాతం భూసమస్యలు పరిష్కారం: ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చి 80శాతం భూసమస్యలు పరిష్కరించిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. భూభారతి పైలట్ ప్రాజెక్టుగా చిలిపిచెడ్ మండలాన్ని తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గౌతాపూర్ గన్య తండాలో 200 వంద మంది రైతులకు పట్టా పాసుబుక్‌లు ఇస్తే, వారికి రైతుబంధు వస్తుందన్నారు. పట్టా పాసుబుక్‌లు లేకపోవడంతో ధాన్యం వారి పేరు మీద విక్రయాలు కావడం లేదని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మెదక్ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉందని, శివ్వంపేట మండలంలో నవాబ్‌పేటకు సంబంధించిన గ్రామం మొత్తం 14ఎకరాలు రెవెన్యూ ఫారెస్టుతో ఒక్కరికి కూడా పట్టా సర్టిఫికెట్ ఇవ్వలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. చిలిపిచెడ్ మండలానికి తహసీల్, ఎంపీడీవో, పోలీస్‌స్టేషన్, నర్సాపూర్‌లో ఆర్డీవో కార్యాలయం మంజూరు చేయాలని మంత్రి పొంగులేటిని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. నర్సాపూర్‌లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి నిధులు మంజూరు చేయాలని మం త్రిని కోరారు.
పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. చిలిపిచెడ్ మండలంలో కొనసాగుతున్న అంతారం రెవెన్యూ గ్రామాన్ని కౌడిపల్లి మండలంలో విలీనం చేయాలని మంత్రి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినీరెడ్డి, మెదక్, నర్సాపూర్, తూప్రాన్ ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, తహసీల్దార్లు సహాదేవ్, ఆంజనేయులు, శ్రీనివాస్, ఎంపీడీవో ఆనంద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.