నర్సాపూర్, మే 16: కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, రేవంత్‌రెడ్డి పాలనలో దుర్భిక్షంగా మా రిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గురువారం నర్సాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి భారీ సంఖ్యలో అంబేద్కర్ చౌరస్తాకు ర్యాలీగా బయలుదేరి చౌరస్తాలో మానవహారం నిర్వహించి ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందన్నారు.
ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చి నేడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని కొర్రీలు పెట్టడం తగదన్నారు. సన్న వడ్లతోపాటు దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. 90 శాతం మంది రైతులు దొడ్డు వడ్లనే పండించారని, ఇచ్చిన హామీ ప్రకారం వారికి బోనస్ చెల్లించాలన్నారు.
సర్కారు నిర్లక్ష్యంతో వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తిందని, రైస్‌మిల్లుల్లో ధాన్యాన్ని దించుకోక వందల లారీలు పడిగాపులు కాస్తున్నాయని వెల్లడించారు. కొనుగోలు కేం ద్రాల్లో ధాన్యాన్ని త్వరగా తూకం వేసి రైస్‌మిల్లులకు తరలించి రైతుల ఖాతాల్లో వేగంగా డబ్బులు జమ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
రైతులకు ఆపద కలిగితే ఏ సమయమైన ఉద్యమిస్తామని, వారికి బీఆర్ఎస్ అం డగా ఉంటుందని మనోధైర్యాన్ని కల్పించారు. కేసీఆర్ పిలుపు మేరకు అధికసంఖ్యలో తరలివచ్చి ధర్నాను విజయవంతం చేసినందుకు బీఆర్ఎస్ శ్రేణులకు, రైతులకు సునీతాలక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పీకోఆప్షన్ సభ్యుడు మన్సూర్, ము న్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగాయిపల్లి గోపి, సత్యం గౌడ్, వైస్‌ఎంపీపీ వెంకటనర్సింగరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సూరారం నర్సింహులు, రాజేశ్, ప్రసాద్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.