నర్సాపూర్, మార్చి 8: ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపుయార్డు ఏర్పాటుతో నర్సాపూర్ పట్టణానికి ఎక్కువగా ముప్పు పొంచి ఉందని మాజీ కౌన్సిలర్ రామచందర్ అన్నారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నర్సాపూర్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకుంది. శనివారం దీక్షలో భాగంగా 8వ వార్డుకు చెందిన అఖిలపక్ష నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు, యూత్ సభ్యులు వంటావార్పు చేపట్టి బాటసారులకు, పేదలకు భోజనం వడ్డించారు.
అనంతరం నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ రామచందర్ మాట్లాడుతూ.. డంపింగ్‌యార్డు ఏర్పాటుతో నర్సాపూర్‌కు ఎక్కువగా ప్రమాదం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి డంపింగ్‌యార్డును రద్దు చేసే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆందోళనలో అఖిలపక్ష నాయకులు రమణారావు, చౌటి జగదీశ్, విష్ణువర్ధన్‌రెడ్డి, ముదిరాజ్ సంఘ సభ్యులు, ముత్యాలమ్మ యూత్ సభ్యులు, డ్రాగన్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, టీటీడీ బాయ్స్ యూత్ సభ్యులు, రెబల్ బాయ్స్ యూత్ సభ్యులు, అంబేద్కర్ యూత్ సభ్యులు, జగ్జీవన్‌రావు సంఘ సభ్యులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.