నర్సాపూర్, జనవరి 29: నర్సాపూర్ గడ్డా బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి రుజువైంది. బీజేపీ ఎత్తులు, కుట్రలను చిత్తు చేస్తూ అవిశ్వాసం నెగ్గి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుని కారు స్పీడును మరింత పెంచింది. రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీల్లో ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టి అన్యాయంగా చైర్మన్ పదవులను లాక్కుంటుండగా, అందుకు విరుద్ధంగా నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతం లో బీఆర్ఎస్ నుంచి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన మురళీయాదవ్ మధ్యలో బీజేపీ తీర్థం పుచ్చుకుని తన పదవికి రాజీనామా చేయకుండా చైర్మన్‌గా చలామణి అయ్యారు. ఇది జీర్ణించుకోలేని బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాలని అడిషనల్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేయడంతో అవిశ్వాసానికి ముం దుగానే మురళీయాదవ్ రాజీనామా చేశారు. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. సోమవారం తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. మొత్తం 15 మంది కౌన్సిలర్లుండగా ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. మిగతా 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు వెంకట్రామ్రెడ్డి, యాదవరెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్‌గా దుర్గప్పగారి అశోక్గౌడ్ని కౌన్సిలర్ రామ్‌చందర్ ప్రతిపాదించగా మరో కౌన్సిలర్ తంగెడుపల్లి సరిత ఆమోదించారు. మిగతా కౌన్సిలర్లు సైతం ఆమోదం తెలుపడంతో మున్సిపల్ చైర్మన్‌గా దుర్గప్పగారి అశోక్‌గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆర్డీవో జయచంద్రారెడ్డి అశోక్‌గౌడ్‌కు మున్సిపల్ చైర్మన్‌గా నియామకపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు అశోక్‌గౌడ్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్‌గా అశోక్‌గౌడ్‌ను ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లందరూ ఏకతాటిపై నిలబడి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారందరినీ అభినందించారు. ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.35 కోట్లు విడుదల చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నిధులను వెనక్కి తీసుకున్నదని, తిరిగి నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లోని బీఆర్ఎస్ చైర్మన్లను కాంగ్రెస్ సర్కారు లాక్కుంటున్నదని, నర్సాపూర్‌లో మాత్రం అందుకు భిన్నంగా బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరి మధ్య బేదాభిప్రాయాలు లేవని అందరూ కలిసిమెలసి నర్సాపూర్ అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
గతంలో బీఆర్ఎస్ నుంచి చైర్మన్‌గా ఎన్నికై బీజేపీలో చేరిన మున్సిపల్ చైర్మన్‌కి బీఆర్ఎస్ కౌన్సిలర్లు తగిన బుద్ధి చెప్పారని మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన అశోక్‌గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పర్యాయాలు బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలని సూచించారు.
నర్సాపూర్ మున్సిపల్ అభివృద్ధికి పాటు పడుతానని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మ న్ అశోక్‌గౌడ్ అన్నారు. ఎన్నికకు సహకరించిన మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 15 రోజుల్లో అవసరమైన పనులను గుర్తించి అమలుచేస్తామన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీని జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. అన్ని పార్టీలు, కౌన్సిలర్లను కలుపుకొని ముందుకెళ్తానని, అందరూ సహకరించాలని కోరారు.