మెదక్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ఏవిధంగా అభివృద్ధి చెందాలి.. ఏ విధంగా రైతును, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి అని ప్రతి వర్గానికి, ప్రతి రంగానికి ఎలాంటి సంక్షేమం అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలో సీఎం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ బీఆర్ఎస్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. పదేండ్ల తెలంగాణలో ప్రతి ఒక్క వర్గానికి చెందిన వారికి సంక్షేమాన్ని అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
రైతాంగానికి 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పంట పెట్టుబడిని ఎవరికీ వారే పెట్టుకుంటారు.. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్ రైతుకు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. కాళేశ్వరం కాల్వలు నర్సాపూర్ నియోజకవర్గానికి రావాల్సిన అవసరం ఉంది. మంజీరా, హల్దీవాగుపై దాదాపు 14 చెక్ డ్యాంలు నిర్మించుకున్నామని ఆమె గుర్తు చేశారు. ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అయ్యిందన్నారు. ఎండాకాలంలో రైతులు ఈ హల్దీవాగుపై సాగు చేస్తున్న రైతుల పంటలు ఎండిపోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు అందించడంతో ఈ ప్రాంత రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సహకారంతో తనను గెలిపించాలని కోరారు. తనపై నమ్మకంతో సీఎం కేసీఆర్ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని, నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నర్సాపూర్ శాసన సభ్యురాలిగా తనను గెలిపిస్తే నర్సాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గాలి అనిల్‌కుమార్, బీజేపీ నుంచి సింగాయిపల్లి గోపి, సంగారెడ్డి బీజేపీ నాయకుడు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా చేయాలన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో పోరంబోకు భూములు చాలా ఉన్నాయని, పోడు భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, వాటిని మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు. వాటిని పరిష్కరించాలని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. నర్సాపూర్ నియోజకవర్గానికి మరో నాలుగైదు వేల ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.