ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో బృహత్తరమైన పథకం రైతుబంధు. ఈ స్కీమ్ రైతుల తలరాతలను మార్చే స్థాయిలో వ్యవసాయంపై ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. నారాయణఖేడ్ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, భూగర్భజలాల కొరత, సాగునీటి వనరుల లేమీ వెరసి ఒకప్పుడు వ్యవసాయం చేయలేక అరిగోస పడిన ఇక్కడి రైతులకు రైతుబంధు పథకం చేయందించి నిలబెట్టింది. ఇక్కడి రైతులు ఏళ్లతరబడి ఎదుర్కొన్న కష్టాలు ఒక వంతైతే, అందుకు భిన్నంగా ఇప్పుడు జిల్లాకే తలమానికంగా నిలిచే రీతిలో అత్యధికంగా రైతుబంధు పెట్టుబడి అందుకోవడం ఇంకో ఎత్తు. సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అత్యధికంగా రైతుబంధు పెట్టుబడి సాయం అందుకుంటున్న నియోజకవర్గం నారాయణఖేడ్ కావడం విశేషం.
నారాయణఖేడ్, మే 7: సంగారెడ్డి జిల్లా మొత్తం రూ.369 కోట్ల 23 లక్షల, 20 వేల 225ల రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ అవుతుండగా, ఒక్క నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రైతులకు రూ.100 కోట్ల 84 లక్షల 92 వేల 275లు ప్రతి ఆరు నెలలకోసారి అందుతున్నాయి. ఈ లెక్కన ఏడాదికి రెండు దఫాలుగా రూ.201 కోట్ల 68 లక్షల పెట్టుబడి సాయం రైతులకు వస్తున్నది. అనేక ఒడిదొడుకుల మధ్య వ్యవసాయాన్ని నెట్టుకొస్తున్న ఇక్కడి రైతులకు రైతుబంధు పథకం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఇతర నియోజకవర్గాల కంటే అత్యధికంగా పెట్టుబడి సాయం రూపంలో ప్రభుత్వం నారాయణఖేడ్ నియోజకవర్గ రైతులకు అందిస్తున్న పెద్దపద్దుపై ప్రత్యేక కథనం…
ధైర్యం నింపిన రైతుబంధు
అత్యధికశాతం నాసిరకం నేలలు, అంతంతమాత్రంగా ఉన్న భూగర్భ జలాలు, సాగునీటి వనరుల కొరత ఇవన్నీ నారాయణఖేడ్ రైతుల మనుగడకు ప్రతిబంధకాలుగా చెప్పవచ్చు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత పరిస్థితులకు భిన్నంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయనడంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇక్కడి రైతుల్లో ధైర్యం నింపి సాగులో ఉన్న భూములు పడావు పడకుండా నిరోధించగా, మరోవైపు పడావు భూములు సైతం సాగులోకి రావడం విశేషం. ఇందుకు ప్రధాన కారణం రైతుబంధు పథకమని చెప్పకతప్పదు. వర్షాధారాన్ని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న రైతులకు ఓ ఏటా అతివృష్టి, మరో ఏటా అనావృష్టి కారణంగా ఆశించిన దిగుబడి రాకపోవడం, తద్వారా మరో పంటకు పెట్టుబడి లేక ఏదో రకంగా వ్యవసాయాన్ని నెట్టుకురావడమో లేక అప్పులు చేసి మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయే అనివార్యత. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ఇక్కడి రైతులకు రైతుబంధు పథకం ఎంతగానో ఉపకరించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏది ఏమైనా దేశం దృష్టిని ఆకర్షించిన రైతుబంధు పథకం నారాయణఖేడ్ ప్రాంతంలో కుంటుపడుతున్న వ్యవసాయానికి పునరుజ్జీవం పోసింది.
2,01,699 ఎకరాలకు 77,111 మంది రైతులకు లబ్ధి
జిల్లాలోని ఇతర నియోజకవర్గాల కంటే నారాయణఖేడ్ నియోజకవర్గ భూ విస్తీర్ణం అధికంగా ఉండడంతోనే ఇతర నియోజకవర్గాల కంటే నారాయణఖేడ్ నియోజకవర్గానికి అత్యధికంగా రైతుబంధు వస్తుందనేది సుస్పష్టం. నియోజకవర్గంలో మొత్తం 2,01,699 ఎకరాల భూములకు గానూ, 77,111ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతున్నది. జిల్లాలో మొత్తం 7,38,466 ఎకరాలకు సంబంధించి 3,15,385 మంది రైతులకు లబ్ధి జరుగుతున్నది. ఇక జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో రైతుబంధు పథకం ద్వారా అందుతున్న పెట్టుబడి సాయాన్ని పరిశీలిస్తే.. సంగారెడ్డి నియోజకవర్గంలో 1,09,524 ఎకరాల్లో 56,882 మంది రైతులకు రూ.54కోట్ల76 లక్షల 17వేల 324, పటాన్చెరు నియోజకవర్గంలోని 49,962 ఎకరాలకు గానూ 31,573 మంది రైతులకు రూ.24కోట్ల98 లక్షల5వేల964, జహీరాబాద్ నియోజకవర్గంలోని 1,99,669 ఎకరాలకు గానూ 71,713 మంది రైతులకు రూ.99 కోట్ల83 లక్షల44 వేల 169, అందోల్ నియోజకవర్గంలోని 1,77,612 ఎకరాలకు గానూ 78,106 మంది రైతులకు రూ.88 కోట్ల80 లక్షల60 వేల 493లు ప్రతి ఆరు నెలలకోసారి రైతుబంధు పథకం పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి.
చాలా సంతోషంగా ఉంది
రైతుబంధు పథకం కారణంగా రైతులు ఆనందంగా ఉంటున్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతుల దుస్థితి చూసినాం, అనుభవించినాం. కానీ, సీఎం కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రైతుల అవసరాలను గుర్తించి అన్ని చర్యలు చేపట్టడమే కాదు పెట్టుబడి కోసం రైతుబంధు రూపంలో సాయం చేస్తుంది. జిల్లాలో అత్యధికంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రైతులకు రైతుబంధు పథకంతో ఏడాదికి రూ.200 కోట్ల లబ్ధి జరుగుతుండడం సంతోషంగా ఉంది.
– వెంకట్రామ్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి
రైతుల కష్టాలు తీరుస్తున్న రైతుబంధు
దశాబ్దాలుగా ఇక్కడి రైతులు పడుతున్న కష్టాలు రైతుబంధుతో తీరిపోయాయి. సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు రైతులను పట్టించుకోని కారణంగా ఇక్కడ వ్యవసాయం చాలా కష్టతరంగా ఉండేంది. కానీ, కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడి రైతులకు అండగా నిలిచి నిరుత్సాహంలో ఉన్న రైతులను తిరిగి వ్యవసాయంపై ఆసక్తిని కల్పించింది. మా రైతులకు రైతుబంధు పథకం ఎంతో ఉపయోగపడుతున్నది. అయితే, జిల్లాలోనే ఇతర నియోజకవర్గాల కంటే ఎక్కువగా మా నియోజకవర్గానికి రైతుబంధు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇటీవల నియోజకవర్గంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో రైతులు స్వచ్ఛందంగా పాల్గొని సంబురాలు చేసుకున్నారు.
– మహారెడ్డి భూపాల్‌రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే
భూ విస్తీర్ణం ఎక్కువగా ఉండడం వల్లే..
ఇతర నియోజకవర్గాల కంటే నారాయణఖేడ్ నియోజకవర్గంలో భూ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న కారణంతోనే ఈ నియోజకవర్గానికి రైతుబంధు పెట్టుబడి ఎక్కువగా వస్తున్నది. డివిజన్లోని కంగ్టి, మనూరు, నాగల్గిద్ద మండలాల్లో పెద్ద కమతాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల రైతుల సంఖ్య తక్కువగా ఉన్నా భూ విస్తీర్ణం మాత్రం ఎక్కువగా ఉంటుంది. చిన్న కమతాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు భూ విస్తీర్ణం తక్కువగాను, రైతుల సంఖ్య ఎక్కువగాను ఉంటుంది.
– కరుణాకర్‌రెడ్డి, ఏడీఏ నారాయణఖేడ్