కొండపాక(కుకునూరుపల్లి), జూన్ 23: విద్యార్థులు లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులు, పుట్టిపెరిగిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని బందారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మనం మన ఊరు ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు.
విద్య ద్వారా విజ్ఞానాన్ని సంపాదించి ఆయా రంగాల్లో వెలుగులు అం దించాలని, తద్వారా సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు. సాధనతో సాధ్యం కానిది ఏదీ లేదని గ్రహించి ఉన్నత లక్ష్యాలు చేరుకునేందుకు తగిన కృషిచేయాలన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన ఎక్కలదేవి పావని, రాగుల అర్చన, కెమ్మెసారం అలేఖ్యకు సిల్వర్ మెడల్స్‌తో పాటు నగదు బహుమతులు అందజేశారు. పాఠశాలలోని విద్యార్థులకు విద్యాభ్యాసం డైరీలు అందజేశారు. హెచ్ఎం రామచంద్రం, మనం మన ఊరు అధ్యక్షుడు ఎన్.భగవాన్‌రెడ్డి, బాల్‌నర్సయ్య, మధుసూదన్‌రెడ్డి, రాజుగౌడ్, వెంకట్‌రెడ్డి, మల్లారెడ్డి, పోషాద్రి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.