సంగారెడ్డి, సెప్టెంబర్ 28: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మం డలం నాగ్సాన్పల్లి శివారులోని శిల్ప వెంచర్లో వాగును ఆక్రమించిన విషయం తెలిసిందే. దీంతో పలు తెలుగు దినపత్రికల్లో వచ్చిన వరుస కథనాలతో సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాం తి దృష్టికి వెళ్లడం, సంబంధితశాఖల అధికారులు విచారణ చేసి ఆక్రమణలుంటే తొలిగించాలని ఆదేశాలు ఇచ్చారు.
అధికారులు శుక్రవా రం వాగుకు ఇరువైపులా సర్వే చేసి గుర్తులు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం నుంచి జేసీబీలను తీసుకువచ్చిన అధికారులు వాగు విస్తరణ కూల్పివేతలను ప్రారంభించారు. వెంచర్లో అధికారులు ఆక్రమణలు కూల్చివేస్తున్నా శిల్ప వెంచర్ యాజమాన్యం మాత్రం కార్యాలయానికే పరిమితమైంది. సదాశివపేట ఇన్స్పెక్టర్ మహేశ్‌గౌడ్ సిబ్బందిని వెంచర్‌కు పంపించి బందోబస్తు ఏర్పాటుచేశారు. వెంచర్లో ముగ్గురు కానిస్టేబుళ్ల నిఘాలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సంయుక్త దాడులతో తొలిగించారు.
ఈనెల 7న కురిసిన భారీ వర్షాలకు శిల్ప వెంచర్ నుంచి 65వ జాతీయ రహదారిపై వరద చేరి రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిం ది.ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, పేట పోలీస్ సిబ్బందితో వరదనీటిని పూర్తి గా తొలిగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. వెంచర్లో ఆక్రమణకు గురైన వాగుతోనే వరద సమస్య వచ్చిందని గుర్తించిన అధికారులు వెంచర్ యాజమాన్యంతో మాట్లాడి ఆక్రమణకు గురైన వాగును విస్తరించాలని సూచించారు. అప్పట్లో వెంచర్ నిర్వాహకులు అధికారుల మాటలకు తలాడించి ఊరుకున్నారు.
సర్వే లాండ్ ఏడీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్త సర్వే చేసి హద్దులు గుర్తించారు. ఈ విషయంపై వెంచర్ యాజమాన్యం జేసీబీలతో వాగుకు రెండు పక్కల విస్తరణ చేస్తామని చెప్పినా చేయలేదు. దీంతో అధికారులే జేసీబీలను తీసుకువచ్చి వాగు పనులు ప్రారంభించారు. సదాశివపేట తహసీల్దార్ సరస్వతి, ఇరిగేషన్ డిప్యూటీ ఇంజినీర్ బాలగణేశ్, గిర్దావర్లు అనంతయ్య, గంగాధర్, ఇరిగేషన్ ఏఈ మహేశ్, మండల సర్వేయర్ ప్రశాంత్‌కుమార్ కూల్చివేత పనులను పర్యవేక్షించారు.