హత్నూర, మార్చి 14: భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ నిత్యపూజలు అందుకుంటున్నది తల్లి పలుగుమీది నల్లపోచమ్మ. పచ్చని అడవిలో.. ఆహ్లాదకర వాతావరణంలో.. దశాబ్దాల కితం వెలసిన వనదేవత భక్తుల కొంగుబంగారం విరాజిల్లుతున్నది. ఆదివారం, బుధవారం, సెలవురోజుల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నది. పచ్చని అటవీ ప్రాంతంలో కొలువు దీరడం, నాలుగు మండలాలకు సమీపంలో ఉండడంతో నిత్యం భక్తుల రాకపోకలతో సందడిగా మారుతున్నది.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం శేర్కాన్‌పల్లి గ్రామశివారులో దట్టమైన అటవీ ప్రాంతంలో నల్లపోచమ్మతల్లి ఆలయం కొలువై ఉంది. మండలంతో పాటు నర్సాపూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలు ఆలయానికి సమీపంలో ఉండడంతో ఈ ప్రాంత ప్రజలు ఆలయానికి వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకొని కోర్కెలు కోరుకుంటారు. హైదరాబాద్‌కు తక్కువ దూరంలోనే ఈ ఆలయం ఉండడంతో అక్కడి ప్రజలు సైతం ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారికి బోనాలు సమర్పించి ఒడిబియ్యం పోసి మేకపోతులు, కోడిపుంజులను బలిస్తారు. ఆలయం వద్ద పలురకాల దుకాణ సముదాయాలు వెలిశాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో నీటి వసతి, రేకులషెడ్లు వంటి సౌకర్యాలు కల్పించారు. అమ్మవారి ప్రసాదాలు విక్రయిస్తుంటారు.
16 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం..
ఈనెల 16నుంచి 20వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 16న అమ్మవారికి ప్రత్యేక పూజలు, 17న అగ్నిగుండాలు, బోనాలు, 18న ఎల్లమ్మ కల్యాణం, బోనాలు, 19న బండ్లు తిరుగుట, 20న బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈసారి ప్రత్యేకంగా ఆలయం వద్ద ఎల్లమ్మ కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి పాలకమండలి సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం..
పలుగుమీది నల్లపోచమ్మ తల్లి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ఈసారి ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాలు నిర్వహిస్తాం. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుకోవాలి. ప్రజాప్రతినిధులు, స్థానికుల సహకారంతో బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషిచేస్తాం.
– శశిధర్, ఆలయ ఈవో
ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం..
దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి పాలక మండలి సభ్యులందరం కృషిచేస్తాం. ఆలయంవద్ద భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నాం. దాతల సహకారంతో అమ్మవారి ఆలయం అభివృద్ధి చెందుతున్నది. ఈసారి ప్రత్యేకంగా ఎల్లమ్మ కల్యాణం జరిపిస్తుండడంతో సమీప ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
– సుదర్శన్‌గౌడ్, ఆలయ పాలకమండలి చైర్మన్