నక్కవాగు.. దశాబ్దాల పాటు పరిశ్రమల కాలుష్యాన్ని గొంతులో నింపుకొని ఏడాదిపాటు పారే నీటి వనరు ఇది. చివరకు ఆ కాలుష్య కాసారాన్ని సైతం రియల్టర్లు వదలడం లేదు. కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లు నక్కవాగును సైతం నలిపేసి.. ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బఫర్‌జోన్ దేవుడెరుగు.. ఎఫ్టీఎల్ను సైతం మట్టితో కప్పేయడంతో మూడు గ్రామాల పరిధిలో వాగు కుచించుకుపోయింది. తెరపైన రియల్టర్లు కనిపిస్తున్నా తెర వెనక మాత్రం రాజకీయ నేతల అండతో పాటు అధికారుల ఆశీర్వాదం కూడా ఉందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా యంత్రాంగం స్పందించకపోతే దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలో నక్కవాగు సన్నబడటమే కాదు భవిష్యత్‌లో జనావాసాలను వరదతో పాటు పరిశ్రమల వ్యర్థాలూ ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది.
Nakkavagu | సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని నక్కవాగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నుంచి కాలుష్య కేంద్రంగా ప్రసిద్ధి. పటాన్చెరు, గడ్డపోచారం, పాశమైలారం వంటి పారిశ్రామికవాడల నుంచి యథేచ్ఛగా వచ్చే రసాయన వ్యర్థాలు ఉసికె వాగు నుంచి నక్కవాగులో కలుస్తాయనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. దీనిపై సంవత్సరాల తరబడి అధ్యయనాలు, సర్వేలు జరిగాయి. ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకున్నా.. నక్కవాగుకు కాలుష్య భూతం నుంచి పూర్తిగా విముక్తి లభించలేదు. పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలతో మండు వేసవిలోనూ ఈ వాగు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా రియల్టర్ల కండ్లు కూడా ఈ వాగుపైనే పడ్డాయి.
వాగు పక్కన ఉన్న వ్యవసాయ భూములను రైతుల నుంచి కొనుగోలు చేసిన రియల్ వ్యాపారులు వాటిని వెంచర్లుగా మలుస్తున్నారు. ఈ క్రమంలో ఆనుకొని ఉన్న వాగును సైతం అందులో కలిపేసుకొని ఎంచక్కా ప్లాట్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అసలు బఫర్‌జోన్ పరిధిలోనే నిర్మాణాలు చేపట్టవద్దని ఉంటే.. ఇక్కడ ఏకంగా వాగు ఎఫ్టీఎల్ను మట్టితో నింపుతున్నారు. ప్రధానంగా పటాన్చెరు అవుటర్ రింగు రోడ్డు నుంచి ముత్తంగి, చిట్కూరు శివారు వరకు దాదాపు ఐదు కిలోమీటర్లకు పైగా భారీ వాహనాలతో వందలాది ట్రిప్పుల్లో మట్టి పోసి నక్కవాగును చిన్న కాల్వగా మారుస్తున్నారు. పటాన్చెరు ఓఆర్ఆర్ సమీపంలో ఓ నిర్మాణ సంస్థ నక్క వాగును మట్టితో మూసివేసి సిమెంట్‌తో నిర్మాణాలు చేపట్టింది.
నక్కవాగును నలిపేయడంలో పైకి రియల్టర్ల పాత్ర కనిపిస్తున్నా.. వెనక రాజకీయ నాయకులు కొందరితో పాటు అధికారుల మిలాఖత్ కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో అందులో వ్యర్థ జలాలు పారుతున్నా.. వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరదను మంజీరా వరకు ఈ నక్కవాగు మోసుకుపోతుంది. ఈ నేపథ్యంలో వందల ఫీట్ల వెడల్పుతో ఉండాల్సిన నక్క వాగు మట్టి పోయడంతో కుచించుకుపోతున్నది. తద్వారా వర్షాకాలంలో పెద్ద ఎత్తున వరద దిగువకు పోయే మార్గం లేక జనావాసాలకు పోటెత్తే ప్రమాదమున్నది. వాస్తవానికి నక్కవాగు దగ్గర నిత్యం వాహనాలతో మట్టిపోసి ప్లాట్లుగా మారుస్తున్న వైనం అందరి కండ్ల ముందే జరుగుతుంది.
దీంతో అధికారులకు గతంలో ఫిర్యాదులు అందడంతో పాటు వారి అవగాహనలోనూ ఈ కబ్జాపర్వం ఉన్నట్లు తెలిసింది. కానీ అటు రెవెన్యూ, ఇటు నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. తద్వారా రియల్టర్లు ఇప్పుడు వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తారు. అమాయకులు వాటిని కొనుగోలు చేసి.. ఎలాగోలా ఇండ్లు నిర్మించుకున్న తర్వాత తిరిగి ఆక్రమణలంటూ ఇదే అధికారగణం బుల్డోజర్లతో విరుచుకుపడి కూల్చివేస్తారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పటాన్చెరు మండలం నుంచి ప్రవహిస్తున్న నక్క వాగును అక్రమించే వారిపై చర్యలు తీసుకుంటాం. వాగు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ గుర్తించి అక్రమణలు తొలిగిస్తాం. వాగును ఆక్రమిస్తున్నారని ఫిర్యాదులు వచ్చా యి. నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని.. సర్వే చేసి తదుపరి చర్యలు తీసుకుంటాం.
– రంగారావు, పటాన్చెరు తహసీల్దార్ , సంగారెడ్డి జిల్లా