Railway Survey | రీజినల్ రింగ్ రోడ్ పక్కన రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీటీసీ సంధ్యారాణి వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణలో భాగంగా రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారని గుర్తు చేశారు.
ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే రైతులు 100 మీటర్ల పొడవునా వ్యవసాయ భూములను వదులుకోవడం జరిగిందని, ప్రభుత్వం మరో 20 నుండి 25 మీటర్ల భూములను తీసుకుంటామని భావించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇదే గనుక జరిగితే ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడతారని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి రైతులందరూ వ్యతిరేకంగా తిరగబడతారని హెచ్చరించారు. రైతుల నుండి మళ్లీ భూములను లాక్కుంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్య వచ్చి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త సర్వే నిర్ణయాన్ని నిలిపివేయాలి..
రైల్వే లైన్ కోసం గతంలో మూడు నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో రైలు మార్గం చేపట్టాలని ప్రతిపాదన ఉందని, సర్వే కూడా చేయడం జరిగిందని అన్నారు. కానీ నేడు ఆ మార్గం నుండి కాకుండా త్రిబుల్ ఆర్లో భూములు కోల్పోయిన రైతుల నుండి మరో 20 నుండి 25 మీటర్ల భూమిని సేకరించాలని ప్రభుత్వం భావించడం మంచిది కాదన్నారు. దయచేసి ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త సర్వే నిర్ణయాన్ని నిలిపివేయాలని సూచించారు.
రైతులు ఇప్పటికే త్రిబుల్ ఆర్ కోసం భూములు వదులుకున్నారని.. అందులో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, చిన్న సన్న కారు రైతులు ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి మొదటి ప్రతిపాదన ప్రకారమే భూముల సేకరణ చేయాలని కోరారు. ఇప్పటికీ మండల పరిధిలోని రెడ్డిపల్లి, మహమ్మదాబాద్, మూసాపేట్ ఇతర గ్రామాల రైతులలో ఆందోళన మొదలైందని, ఇది పార్టీకి తీరని నష్టం తీసుకువస్తుందని హెచ్చరించారు.
Ganja Seized | ద్విచక్ర వాహనంపై గంజాయి తరలింపు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Vice president Elections | ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టిన ఈసీ