సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 22 : 2024-25 సంవత్సరానికి సిద్దిపేట మున్సిపాలిటీకి రూ.98.51 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గురువారం పట్టణ పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు అధ్యక్షతన జరిగిన వార్షిక బడ్జెట్ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ వార్షిక బడ్జెట్‌కు ఏకగ్రీవ ఆమోదం తెలిపిన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కృషితో సిద్దిపేట పట్టణం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
దేశవ్యాప్తంగా సిద్దిపేట మున్సిపాలిటీకి ఇంత పేరు, ప్రఖ్యాతలు రావడానికి కారణమైన హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పట్టణానికి మరిన్ని అవార్డులు వచ్చేలా కృషి చేయాలన్నారు. పట్టణంలో ప్రారంభించిన రుతుప్రేమ, సిద్దిపేట స్వచ్ఛబడి దేశంలోని ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. సమా వేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, అధికారులు పాల్గొన్నారు.