సిద్దిపేట కలెక్టరేట్, ఆగస్టు 28: ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి కోఆర్డినేషన్ మానిటరింగ్ సమావేశాన్ని ఎంపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈజీఎస్ పథకం అమలు, చేపట్టిన పనులు, కూలీలకు వేతనాల చెల్లింపులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈజీఎస్‌లో 80 నూతన భవనాలు నిర్మించామని, మిగతా భవనా లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. సెప్టెంబర్ 19 వరకు నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.
సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. ఇప్ప టివరకు జిల్లాలో 12.50 లక్షల మొక్కలు నాటగా అందులో 92శాతం మొక్కలు బతికాయని, అవసరమైన చోట నాటే ప్రక్రియ కొనసాగుతున్నదని అధికారులు తెలుపగా, పదేండ్లుగా నాటిన మొక్కల వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటడం మీద శ్రద్ధపెడుతున్నారు కానీ, వాటి పర్యవేక్షణ పట్టించుకోవడం లేన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో తూకం విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండాచూడాలని, రైస్ మిల్లులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మిల్లర్లకు లాభం చేకూర్చే విధంగా కాకుండా రైతులకు న్యాయం జరిగేలా పనిచేయాలన్నా రు.
సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఎన్ని డబుల్‌బెడ్ రూమ్‌లు పేదలకు అందజేశారు, ఎంత మందికి పట్టా లు ఇచ్చారని అధికారులను ప్రశ్నించగా పూర్తి వివరాలు వచ్చే సమావేశంలో అందజేస్తామని తెలిపారు. ప్రైవేట్ దవాఖానలను తనిఖీ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలో రెండు కొత్తగా బ్లడ్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, గరిమా అగర్వాల్, అన్ని ప్రభుత్వ శాఖల సిద్దిపేట జిల్లా అధికారులు పాల్గొన్నారు.