మునిపల్లి, ఫిబ్రవరి 25 : ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరాలో ముంబయి జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. మునిపల్లి ఎస్సై రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం.. మునిపల్లి మండలంలోని అంతారం గ్రామానికి చెందిన పిచ్చకుట్ల లక్ష్మి(54), రవి(32), శోభారాణి(28) కలిసి మంగళవారం ముంబయి జాతీయ రహదారి మీదుగా కంకోల్ వైపు నుంచి సదాశివపేట వైపు బైక్‌పై బయలుదేరారు.
బుధేరా చౌరస్తాలోని ఫ్లైఓవర్‌పై వద్ద గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మృతుడు రవికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతులు లక్ష్మి, రవి తల్లీకుమారులు కాగా, మృతురాలు శోభారాణి మృతుడు రవి భార్య. తల్లిదండ్రులతో పాటు నానమ్మ చనిపోవడంతో రవి ఇద్దరు కుమారులు విలపించారు. వారి రోదనలు అందరినీ కదలించాయి. తల్లిదండ్రుల మృతితో ఆ చిన్నారులు అనాథలుగా మారారు.