శివ్వంపేట, నవంబర్ 23: కార్తిక బహుళ అమావాస్య ఎంతో విశేషమైనదని, శివకేశవులకు ప్రీతిపాత్రమైనదని అమ్మవారి ఉపాసకుడు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ తెలిపారు. మండల కేంద్రంలో నిర్మిస్తున్న శక్తిపీఠాల్లో ఒక్కటైన బగలాముఖి శక్తిపీఠం నిర్మాణా స్థలిలో బాలాలయంలో కార్తిక బహుళ అమావాస్య సందర్భంగా బుధవారం అమ్మవారికి మూలమంత్ర హావనం నిర్వహించారు. బగలాముఖి శక్తిపీఠం ట్రస్టు చైర్మన్, అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బగలాముఖి అమ్మవారికి ప్రత్యేక పూజలు, పూర్ణాహుతి, మంత్రపుష్పం, మంగళహారతిని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కాగా నర్సాపూర్ మున్సిప్కోర్టు జడ్జి అనిత హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఉమ్మడి మెదక్ జిల్లా, హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. బహుళ అమావాస్య రోజున బగలాముఖి అమ్మవారికి హావనం చేయడం విశేషమన్నారు. అంతకుముందు నూతనంగా నిర్మిస్తున్న బగలాముఖి శక్తిపీఠం నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో బగలాముఖి ట్రస్ట్ సభ్యులు సర్పంచ్ పత్రాల శ్రీనివాస్‌గౌడ్, శాస్త్రుల దేవదత్తు శర్మ, పురోహితులు పురుషోత్తంశర్మ, ఉపసర్పంచ్ పద్మవెంకటేశ్, వంజరి కొండల్, గౌరీశంకర్, ఇసుగారి శ్రీనివాస్, ముద్దగల్ల రాజు, న్యాయవాది అంజిరెడ్డి, శ్రీనివాస్, కుమ్మరి సత్యనారాయణ, డాక్టర్ సండ్ర సుదర్శన్, అమ్మవారి భక్తులు కొత్తపేట నర్సింలుగౌడ్, పైనం లక్ష్మీనారాయణ, బొడ్డు భిక్షపతి, రాజిపేట కృష్ణ, మంతురి నర్సింలుగౌడ్ పాల్గొన్నారు.
రాయికోడ్,నవంబర్ 23: కార్తిక మాసం ముగింపును పురస్కరించుకుని, లలిత కోటి పార్థీవ లింగేశ్వర ఆలయంలో, వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం అమ్మవారికి ప్రత్యేకించి అభిషేకాలు, కుంకుమార్చనలు చేశారు. ఆనంతరం ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, టైక్స్‌టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ సతీమణి అరుణ, జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ మహిళ సంఘం సభ్యులు శశికళ, అన్నపూర్ణ, విజయ,శిరీష, సంగీతలకు ఆలయ ధర్మకర్త సుధీర్పాటిల్ సన్మానించారు. కార్యక్రమంలో పూజారులు వీరేశంస్వామి, రుద్రయ్యస్వామి, బస్వరాజుస్వామి, శివకుమార్‌స్వామి పాల్గొన్నారు.
వట్పల్లి, నవంబర్ 23: దేవునూర్ గ్రామం నుంచి శివస్వాములు శ్రీశైలానికి పాదయాత్ర చేపట్టారు. ఇరవై ఏండ్లుగా గ్రామంలో శివ మాలధారణ ధరించి, భజనలు చేస్తూ, దీక్ష విరమణ సమయంలో శివకటాక్షం పొందేందుకు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.